రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మృతి

0
35

తెలుగు సినీ ఇండస్ట్రీ లో పెను విషాదం చోటు చేసుకుంది. సినీ హీరో, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ(61) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్గొండ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి హైదరాబాద్‌ వస్తుండగా అన్నేపర్తి దగ్గర డివైడర్‌ను ఢికొట్టిన కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. దీంతో కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణకు తలకు, శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి హరికృష్ణను స్థానికులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు.వెంటనే స్పందించిన వైద్యులు చికిత్స అందించేందుకు ప్రయత్నించినా.. ఆయన శరీరం సహకరించకపోవడంతో కన్నుమూశారని సమాచారం. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది.

గతంలో హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకి రామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. 2009 ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తూ ఎన్టీఆర్ ప్రాణాలు దక్కాయి. అప్పట్లో ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం జరగిన ప్రాంతంలోనే జానకి రామ్ కారు ప్రమాదానికి గురి అయింది. ఇప్పడు హరికృష్ణకు కూడా అదే జిల్లాలో ప్రమాదం జరిగింది. ఈ విషయం నందమూరి అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది.