మలేరియా వ్యాధి నిరోధక టీకా.. ప్రపంచంలోనే మొదటిసారి అందుబాటులోకొచ్చిన వ్యాక్సిన్

మలేరియా వ్యాధి నిరోధక టీకా.. ప్రపంచంలోనే మొదటిసారి అందుబాటులోకొచ్చిన వ్యాక్సిన్

0
32

మలేరియా వ్యాధికి టీకా (వాక్సిన్) అందుబాటులోకి రానుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఈ వాక్సిన్ కెన్యాలో శుక్రవారం నుంచి అందుబాటులోకి రానుంది. ఈ వాక్సిన్ త్వరలోనే పిల్లలకు ఇచ్చే సాధారణ టీకాల ప్రణాళికలో భాగం కానుంది. మూడేళ్లలో కనీసం 3 లక్షల మంది చిన్నారులకు ఈ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ వ్యాక్సిన్ తయారీకి 30 ఏళ్ల సమయం పట్టింది. మానవుల్లోని రోగ నిరోధక వ్యవస్థకు తగిన శిక్షణనిచ్చి మలేరియా వ్యాధికారక సూక్ష్మజీవులపై పోరాడేందుకు ఈ టీకా దోహదం చేస్తుంది. మలేరియా వ్యాధి దోమకాటు వల్ల వ్యాపిస్తుంది. ఈ వ్యాక్సిన్ను చిన్నారులకు రెండేళ్ల వయసు వచ్చేలోపు నాలుగు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల కనీసం 10మంది చిన్నారుల్లో నలుగురిలో మలేరియా కేసులు తగ్గుముఖం పట్టాయి.

ప్రస్తుతం మలేరియా వ్యాధి కేసులు కూడా 1/3 వంతు తగ్గినట్లు వెల్లడైంది. ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ఫలితాలు లేవని, ఇది కేవలం మలేరియాను అరికట్టేందుకు ప్రభావవంతంగా పనిచేస్తుందని క్లినికల్ ట్రయల్స్లో ఇప్పటికే వెల్లడించింది.. కెన్యాలోని కిసుము, కాకమెగా, మోంబాసా ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లో మొదటగా ఈ వ్యాక్సిన్ను సరఫరా చేయనున్నారు. వాస్తవ పరిస్థితుల్లో ఈ వాక్సిన్ ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో పరిశీలించాల్సి ఉంది. ఎంతోమంది మరణాలకు కారణమవుతున్న మలేరియా వ్యాధి నిర్మూలనలో కచ్చితంగా ఇది మార్పులను తీసుకురానుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 4 లక్షల మంది మలేరియా బారినపడి మరణిస్తున్నారు. వీరిలో చిన్నారులే అధికంగా ఉంటున్నారు.