టాలీవుడ్ లో మరో విషాదం..ఆ నటుడు ఇక లేరు

Another tragedy in Tollywood

0

తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటు చేసుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు (64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. సినిమాలతో పాటు టీవీ రంగంలో కూడా రాజబాబు రాణించారు. రాజబాబుకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది.

రాజబాబు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలంలోని నరసాపురపేట. ఆయన తండ్రి పేరు రామతారకం. ఆయన చిత్ర నిర్మాత నటుడు. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో “స్వర్గం -నరకం, రాధమ్మ పెళ్లి సినిమాలను నిర్మించారు.  చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న రాజబాబు నాటకాలు వేస్తూ దేశమంతా తిరిగారు. దర్శకుడు ఉప్పలపాటి నారాయణ రావు 1995లో ‘ఊరికి మొనగాడు’ అనే సినిమాలో అవకాశం ఇవ్వడంతో రాజబాబు తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

ఆ తరువాత ఆనతి కాలంలోనే రాజబాబు ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, మురారి, శ్రీకారం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సముద్రం, కళ్యాణ వైభోగం, మళ్ళీ రావా, శ్రీకారం ,బ్రహ్మోత్సవం మొదలైన 62 చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను పోషించారు.

సినిమాతో పాటు టీవీ రంగంలో కూడా రాజబాబు నటించారు. రాజబాబు 48 సీరియల్స్ లో విభిన్నమైన పాత్రల్లో నటించి అందరికీ ఆత్మీయుడయ్యారు . 2005వ సంవత్సరంలో “అమ్మ ” సీరియల్ లోని పాత్రకు నంది అవార్డు వచ్చింది. తెర మీద గంభీరంగా కనిపించే రాజబాబు నిత్య జీవితంలో చాలా సరదామనిషి. రాజబాబును అందరూ బాబాయ్‌ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here