దళితులకు కేసీఆర్ వరాల జల్లు

0

తమ అభివృద్ధిని తామే నిర్వచించుకునే దిశగా చైతన్యమై, ఉత్పత్తిలో భాగస్వాములైన నాడే దళితుల సాధికారతకు నిజమైన అర్థం లభిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. అనతి కాలంలో ఆర్థిక స్వావలంబన కలిగించే వినూత్న ఉపాధి స్కీంలను ‘తెలంగాణ దళిత బంధు’ పథకంలో భాగంగా రూపకల్పన చేసి లబ్ధిదారుల ముందుంచాలని సిఎం తెలిపారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. ముందు అధికారులు సెన్సిటైజ్ కావడం ఆ తర్వాత అర్హులైన లబ్ధిదారులను పథకం ఉపయోగించుకోవడంలో ఉద్ధీపన (సెన్సిటైజ్) చేయాలని సిఎం అధికారులకు తెలిపారు.
రాష్ట్రంలోని దళితుల అభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న తెలంగాణ దళిత బంధు పథకం అమలు విధి విధానాలు, రూపొందించాల్సిన ఉపాధి పథకాల పై సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో సమీక్షాసమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఎస్సీ డెవలప్ కార్పోరేషన్ ఎండీ పి.కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…‘‘ క్షేత్రస్థాయిలో పైలట్ ప్రాజెక్టు నియోజకవర్గ గ్రామాల్లో పర్యటించి దళిత కుటుంబాల స్థితి గతులను అర్థం చేసుకోవాలి. వారి అభిప్రాయాలను సేకరించాలి. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వారికి అనువైన రీతిలో త్వరితగతిన ఆర్థిక స్థిరత్వాన్ని కలిగించే పలు రకాల పనులను గుర్తించి వాటిని పథకాలుగా మలచాలి. ముందు అధికారులు ప్రభుత్వ యంత్రాంగం ఆదిశగా సెన్సిటైజ్ కావాలి. ’’ అని సిఎం కెసిఆర్ వివరించారు.

ఉన్నతాధికారులు ప్రభుత్వ యంత్రాంగం పైలెట్ ప్రాజెక్టు కేంద్రంగా ముందో అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ఉపాధి కల్పించే పలు వినూత్న పథకాల రూప కల్పనకోసం క్షేత్రస్థాయి పర్యటలను ఎలా చేపట్టాలి, ఆ సందర్బంగా ఎవరెవరిని కలవాలి, వారి నుంచి సమాచారం ఏ విధంగా తీసుకోవాలి, దళితుల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న అనుభవజ్జుల సలహాలను పాటించి వారి సూచనలను పథకంలో భాగంగా ఎట్లా అమలు పరచాలి… అనే అంశాల మీద ముందుగా అధికారులు సెన్సిటైజ్ కావాలని సిఎం సూచించారు.
ఇందులో భాగంగా ఉన్నతాధికారులు ఉద్యోగులు దళిత ప్రముఖులు, దళిత సంఘాల నేతలు యాక్టివిస్టుల తో కూడిన వర్క్ షాపు త్వరలో నిర్వహించనున్నట్టు సిఎం తెలిపారు.
వర్కుషాప్ లో తీసుకున్న నిర్ణయాలను అనుసరించి పైలట్ ప్రాజెక్టు చేపడుతున్న నియోజకవర్గంలోని దళిత వాడలకు వెల్లాలని, అక్కడ దళిత కుటుంబాలతో మాట్లాడాలని, దళిత సమస్యల పై అవగాహన వున్న దళిత ప్రముఖులను కలవాలని వారి సలహాలు సూచనలతో స్కీంలను రూపొందించాలని సిఎం తెలిపారు. దళితుల అవసరాలు ఎట్లున్నయి ? అర్హులైన లబ్ధిదారులకు పథకం అందించగానే ఎక్కువకాలం గ్యాప్ లేకుండా ఆదాయం సృష్టించుకునే విధంగా వుందా లేదా గుర్తించి పథకం రూపకల్పన చేయాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here