ఎన్నికల ఖర్చుపై జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టులో కొనసాగిన వాదనలు

ఎన్నికల ఖర్చుపై జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టులో కొనసాగిన వాదనలు

0

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి రూ. 50 కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు చేశారంటూ టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఒకరు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టులో ఈరోజు వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం తరపు లాయర్ వాదిస్తూ, జేసీ వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రావని కోర్టుకు తెలిపారు. జేసీ ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదని చెప్పారు. ఆయన తప్పు ఏమీ లేదనని తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ కూడా నివేదిక ఇచ్చారని తెలిపారు. ఎన్నికల ఖర్చుపై మాట్లాడుతూ యథాలాపంగా జేసీ ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు.

అనంతరం హైకోర్టు స్పందిస్తూ, ఎన్నికలు ముగిసిపోయాయని, ఈసీ కూడా జేసీ వ్యాఖ్యలపై ఓ నిర్ణయానికి వచ్చిందని, ఈ కేసును ఇంకా కొనసాగించాలనుకుంటున్నారా? అని పిటిషనర్ ను ప్రశ్నించింది. జేసీ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ, ఆయన కుమారుడు పోటీ చేశారని… ఆయన కుమారుడి కోసం ఖర్చు చేసినట్టు జేసీ చెప్పారని పిటిషనర్ తెలిపారు. దీంతో, ప్రతివాదిగా జేసీ దివాకర్ రెడ్డి స్థానంలో ఆయన కుమారుడు జేసీ పవన్ రెడ్డి పేరును చేర్చాలని కోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో సవరించిన పిటిషన్ ను దాఖలు చేయాలని పిటిషనర్ కు సూచించింది.