పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్న మావోయిస్టులు: కిషన్ రెడ్డి

పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్న మావోయిస్టులు: కిషన్ రెడ్డి

0

అభంశుభం తెలియని పిల్లలను చేర్చుకుని వారికి మావోయిస్టులు మిలిటరీ ట్రైనింగ్ ఇస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. లోక్ సభలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, జార్ఖండ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో వంట వండటానికి, నిత్యావసర వస్తువులను తీసురావడానికి, భద్రతా బలగాల కదలికల గురించి సమాచారం అందించేందుకు పిల్లల సేవలను మావోయిస్టులు వినియోగించుకుంటున్నట్టు సమాచారం ఉందని చెప్పారు. దీంతో పాటు వారికి మిలిటరీ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారని తెలిపారు.

మావోయిస్టుల ప్రభావం ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని… కేంద్ర బలగాలు, హెలికాప్టర్లను సమకూర్చుతోందని చెప్పారు. పోలీసు బలగాల ఆధునికీకరణ స్కీం కింద నిధులను కూడా అందిస్తోందని తెలిపారు. గతంలో పోల్చితే మావోయిస్టుల హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టాయని… 2009లో 2,258 ఘటనలు చోటు చేసుకోగా… 2018కి దాని సంఖ్య 833కి తగ్గిందని చెప్పారు.