పాక్‌లో మికా సింగ్‌ ప్రదర్శన..నెటిజన్ల ఆగ్రహం

పాక్‌లో మికా సింగ్‌ ప్రదర్శన..నెటిజన్ల ఆగ్రహం

0

జమ్ముకశ్మీర్‌కి స్వయంప్రతిపత్తి కల్పించే అధికరణ 370ని రద్దు చేసిన తరువాత భారత్‌-పాక్‌ మధ్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. భారత్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన దాయాది దేశం భారత్‌తో వాణిజ్య బంధాన్ని రద్దు చేసుకోవడమేగాక బాలీవుడ్‌ సినిమాలపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో పాక్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు చెందిన సమీప బంధువు ఇంట్లో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి భారత ప్రముఖ గాయకుడు మికా సింగ్‌ హాజరు కావడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఆయన తన బృందంతో పాటు చేస్తున్న సంగీత కచేరీకి అక్కడి వారు నృత్యం చేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో అటు పాకిస్థాన్‌తో ఇటు భారత్‌లోని నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వేడుక ఆగస్టు 8న జరిగినట్లు సమాచారం. తాజాగా వీడియో బయటికి పొక్కడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

దీనిపై పాకిస్థాన్‌ ప్రతిపక్ష పార్టీ నేత సయ్యద్‌ ఖుర్షీద్‌ షా తీవ్రంగా మండిపడ్డారు. భారత్‌తో సంబంధాలు తెంచుకున్నామని చెబుతూనే ఆ దేశ గాయకుడికి వీసా ఎలా ఇచ్చారంటూ అక్కడి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక వేళ ముందే వీసా అనుమతి లభించి ఉంటే తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రద్దు చేసి ఉండాల్సిందన్నారు. దీనిపై కొంత మంది నెటిజన్లు స్పందిస్తూ.. కళల్ని, రాజకీయాల్ని మిళితం చెయ్యొద్దని వ్యాఖ్యానించారు. కళాకారులకు ప్రాంతాలు, భాషలు, మనుషులతో సంబంధం లేదన్నారు.