ఈ కొత్త గొడవేంటి నాని!!

ఈ కొత్త గొడవేంటి నాని!!

0

ఏదో ఒక వివాదం లేనిదే సినిమాలు సాఫీగా రిలీజవ్వని పరిస్థితి. ముఖ్యంగా టైటిల్ వివాదాలు టాలీవుడ్ లో నిరంతరం చూడాల్సొస్తోంది. మహేష్ ఖలేజా.. కళ్యాణ్ రామ్ కత్తి టైటిళ్ల వివాదాల రచ్చ గురించి తెలిసిందే. వేరొకరు రిజిస్టర్ చేసిన టైటిల్ ని పెట్టుకుంటే పెద్ద చిక్కే మరి. మన పరిశ్రమలో ఇదో నిరంతర ప్రక్రియలా కొనసాగుతోంది. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని `గ్యాంగ్ లీడర్`కి ఈ సమస్య తప్పడం లేదు.

నాని- విక్రమ్ కె- మైత్రి బృందం `గ్యాంగ్ లీడర్` టైటిల్ ని తమ నుంచి తస్కరించారని ఎస్.ఎం.కే ఫిలింస్ సంస్థ ఇదివరకూ ఆరోపించింది. మెగాస్టార్ చిరంజీవి సినిమా స్ఫూర్తితో ఈ టైటిల్ ని ఎంపిక చేసుకుని సినిమా తీస్తున్నామని అలాగే మెగాస్టార్ బర్త్ డే ఆగస్టు 22న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలు చిత్రీకరణలు ముగింపులో మరోసారి టైటిల్ వివాదం రచ్చకెక్కుతోంది.

నానీస్ గ్యాంగ్ లీడర్ అంటూ టైటిల్ ని మార్చి `గ్యాంగ్ లీడర్` ఫ్లేవర్ టైటిల్ నుంచి మిస్ కాకుండా విక్రమ్.కె టీమ్ ఎత్తుగడ వేసిందని ప్రచారమైంది. అయితే దీనిని తిప్పి కొట్టేందుకు తాజాగా ఎస్.ఎం.కె ఫిలింస్ సంస్థ సన్నాహకాల్లో ఉందట. ఇప్పటికే ఫిలింఛాంబర్ లో మరోమారు నానీ బృందంపై ఫిర్యాదు చేయడమే గాక మైత్రి మూవీ మేకర్స్ కి నోటీసులు పంపించారని తెలుస్తోంది. దీంతో గొడవ పెద్దదవుతోందా? ఇరువురి మధ్యా సఖ్యత కుదరలేదా? అన్న సందేహాలు నెలకొన్నాయి.