పార్లమెంట్‌లో నిర్మల.. జీఎస్టీ మీటింగ్‌ వాయిదా

పార్లమెంట్‌లో నిర్మల.. జీఎస్టీ మీటింగ్‌ వాయిదా

0

వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) కౌన్సిల్‌ 36వ సమావేశం అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం.. గురువారం ఈ సమావేశం జరగాలి. అయితే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ రోజు తప్పనిసరిగా పార్లమెంట్‌లో ఉండాల్సి వచ్చింది. రాజ్యసభలో దివాలా చట్ట సవరణలపై చర్చ జరగనున్న నేపథ్యంలో నిర్మల సభ నుంచి రాలేకపోయారు. దీంతో జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కొత్త తేదీని తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.

జీఎస్టీ కౌన్సిల్‌ 36వ సమావేశంలో విద్యుత్‌ వాహనాలు, సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులపై పన్ను తగ్గింపు, లాటరీలపై జీఎస్టీ రేట్ల సవరణ వంటి కీలక అంశాలపై చర్చ జరపాలని తొలుత అజెండాగా పెట్టుకున్నారు. అయితే సమయాభావం దృష్ట్యా విద్యుత్‌ వాహనాలపై పన్ను తగ్గింపుపై మాత్రమే చర్చించాలని నిర్ణయించారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశం నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. అయితే పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో ఈ మీటింగ్‌ను చివరి నిమిషంలో వాయిదా వేయాల్సి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.