పంతా?..కార్తీకా? టీ20 ప్రపంచకప్ లో చోటెవరికి?

0

ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాక ఆ ఖాళీని భర్తీ చేసే ఆటగాడిగా రిషబ్ పంత్ పేరు తెచ్చుకున్నాడు. టెస్టుల్లో కూడా T20 తరహా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అతని సొంతం. ధనాధన్ బ్యాటింగ్ తో క్షణాల్లో ఫలితాల్ని తారుమారు చేసే పంత్.. అదే ప్రదర్శన టీ20లు, వన్డేల్లో రిపీట్ చేయలేకపోతున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పంత్ కొంప మునిగేలా ఉంది. రానున్న టి20 2022 ప్రపం‍చకప్‌లో పంత్ కు చోటు లభిస్తుందా అనే అనుమానం కలుగుతుంది. మరోవైపు దినేష్ కార్తీక్ నిలకడగా రాణించడం ఇప్పుడు పంత్ అయోమయంలో పడ్డాడు.

ఇంకా ప్రపంచకప్‌కు నాలుగు నెలల సమయం మాత్రమే ఉండడంతో అప్పటిలోగా టీమిండియా బెస్ట్‌ జట్టును ఎంపికచేయాలని బీసీసీఐ భావిస్తోంది. అదే నిజమైతే ఇప్పుడును జోరును కార్తిక్‌ ఇలాగే కొనసాగిస్తే.. వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాట్స్‌మన్‌గా దినేశ్‌ కార్తిక్‌ తుది జట్టులో చోటు దక్కడం ఖాయం. రిషబ్‌ పంత్‌ను ఎంపిక చేసినప్పటికి అతనికి తుది జట్టులో చోటు దక్కడం కష్టమే. కార్తిక్‌ కూడా టీమిండియాకు టి20 కప్‌ అందించి తీరుతానని చాలా సందర్భాల్లో పేర్కొన్నాడు. ఇప్పుడున్న జోరులో కార్తిక్‌కు ఇది పెద్ద కష్టం కాకపోవచ్చు.

సౌతాఫ్రికాతో టి20 సిరీస్‌లో పంత్‌ కెప్టెన్‌గా ఉండకపోయుంటే ఈ పాటికే అతను జట్టులో స్థానం కోల్పోయేవాడేమో. ఈ మధ్య కాలంలో పంత్‌ ఆటతీరు చూసుకుంటే అలాగే ఉంటుంది. వరుసగా విఫలం కావడం.. జట్టు నుంచి తీసేస్తారు అన్న సందర్బంలో మళ్లీ బ్యాటింగ్‌లో మెరవడం.. యాదృశ్చికంగా టీమిండియా కూడా విజయం సాధించడంతో పంత్‌ తన స్థానాన్ని నిలుపుకుంటూ వస్తున్నాడు. తాజాగా సౌతాఫ్రికాతో సిరీస్‌లోనూ పంత్‌ పెద్దగా రాణించలేకపోతున్నాడు.

ఒక కెప్టెన్‌గా బాధ్యతాయుతంగా ఆడాల్సింది పోయి అనవసర షాట్‌కు యత్నించి నిర్లక్ష్యంగా వికెట్‌ పారేసుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈ సిరీస్‌ వరకు పంత్‌కు ఇబ్బంది లేకపోవచ్చు గానీ.. ఇదే తరహా ఆటతీరు ప్రదర్శిస్తే మాత్రం రానున్న రోజుల్లో అతని స్థానం గల్లంతవ్వడం ఖాయం. ఇలా ముందు ఇషాన్‌ కిషన్‌.. వెనుక చూస్తే దినేశ్‌ కార్తిక్‌లు జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉండగా.. పంత్‌ మాత్రం నిర్లక్ష్యంగా ఆడుతూ తన స్థానానికి ఎసరు తెచ్చుకుంటున్నాడు. పంత్ తన ఆట తీరును మార్చుకుంటాడో లేదో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here