‘బిగ్ బాస్‌’పై శ్వేతారెడ్డి ఫిర్యాదు

Bigg Boss 3 | ‘బిగ్ బాస్‌’పై శ్వేతారెడ్డి ఫిర్యాదు

0

బిగ్ బాస్ షో నిర్వాహకులపై మాజీ యాంకర్ శ్వేతారెడ్డి ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ 3 షోలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఆమె హైదరాబాద్ జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అయితే, అది బంజారా హిల్స్ పరిధిలోకి వస్తుందంటూ వారు సూచించడంతో ఆమె బంజారాహిల్స్‌కు వెళ్లారు.. బిగ్ బాస్ 3 ద్వారా ఉత్తరాది సంస్కృతిని తెలుగువారిపై రుద్దుతున్నారని ఆమె ఆరోపించారు. బిగ్ బాస్‌లో క్యాస్టింగ్ కౌచ్‌ జరుగుతోందంటూ శ్వేతారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బిగ్ బాస్ 3 అడిషన్స్‌లో సెలక్ట్ అయిన తనను ఓ నిర్మాత ‘బిగ్ బాస్‌ను కన్విన్స్ చేస్తే.. షోలోకి ఎంట్రీ ఇస్తాం’ అంటూ మాట్లాడారంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఆమె వ్యాఖ్యలు దుమారం రేపాయి. బిగ్ బాస్ షో మీద నీలినీడలు కమ్ముకున్నాయి.

‘సెలక్షన్స్ కోసం వచ్చిన వారిని కమిట్‌మెంట్ ఇస్తారా?, బాస్‌ని ఎప్పుడు సంతృప్తి పరుస్తారు? మీరు బాడీ ఎప్పుడు తగ్గించుకుంటారు. వర్కవుట్స్ ఎప్పుటి నుంచి మొదలు పెడతారు? అని అడిగారు. బిగ్ బాస్ అనేది గేమ్ షో. దాంట్లో బాడీ షేప్‌కి సంబంధం ఏంటి? శ్యామ్ అనే నిర్మాత తనతో అసభ్యంగా మాట్లాడారు’ అని శ్వేతారెడ్డి ఆరోపించారు.

తెలుగులో బిగ్ బాస్ సీజన్ 3 ఈనెల 21 నుంచి ప్రారంభం కానుంది. మొదటి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నాని హోస్ట్‌లుగా వ్యవహరించారు. మూడో సీజన్‌కు కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక దాదాపు పూర్తయినట్టు తెలిసింది. వారిని హౌస్‌లోకి పంపనున్నారు.