తలాక్‌ తలాక్‌ తలాక్‌ అంటే.. ఇకపై నేరమే

తలాక్‌ తలాక్‌ తలాక్‌ అంటే.. ఇకపై నేరమే

0

ముస్లిం సమాజంలో అమల్లో ఉన్న సత్వర విడాకుల ఆచారం ట్రిపుల్‌ తలాక్‌ ఇక నుంచి శిక్షార్హమైన నేరం కానుంది. ఈ మేరకు ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చిందని ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

గత ఫిబ్రవరిలో జారిచేసిన ట్రిపుల్‌ తలాక్‌ ఆర్డినెన్స్‌ స్థానంలో ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ చట్టం-2019 అమల్లోకి వచ్చింది. తలాక్‌ ఏ బిదత్‌తోపాటు ఇతర రూపాల్లో ఉన్న సత్వర తలాఖ్‌ విధానాలు ఇకపై చెల్లబోవు. మహిళలకు తమ భర్తలు వెనువెంటనే విడాకులు ఇచ్చేవిధానం ఇకపై నేరం కానుంది. మౌఖికంగాగానీ, లిఖితపూర్వకంగాగానీ, లేదా ఎలక్ట్రానిక్‌ రూపంలో ఇచ్చే సత్వర తలాక్‌ విధానం ఇకపై చెల్లబోదు, చట్టవిరుద్ధమని ఈ చట్టం పేర్కొంది. ఈ చట్టం ప్రకారం మూడుసార్లు తలాక్‌ అని పేర్కొంటూ ముస్లిం భర్తలు తమ భార్యలకు విడాకులు ఇస్తే.. దానిని నేరంగా పరిగణిస్తారు. ఇందుకు మూడేళ్ల వరకు జైలుశిక్షతోపాటు జరిమానా కూడా విధించే అవకాశముంది. విపక్షాల వ్యతిరేకత నడుమ ఇటీవల ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు రాజ్యసభలో గట్టెక్కిన సంగతి తెలిసిందే.