అవే కొంపముంచాయా.. టీడీపీ ఆత్మపరిశీలన!

అవే కొంపముంచాయా.. టీడీపీ ఆత్మపరిశీలన!

0

ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు పార్టీ సమీక్షలతో బిజీగా ఉంటున్నారు. ఎందుకు ఓడిపోయాం అంటూ చర్చించుకుంటున్నారు. పలువురు పలు కారణాలు చెప్తున్నారు. అందులో ప్రధానమైంది ఇసుక. గత ప్రభుత్వ హయాంలో ఇసుక దందా ఏస్థాయిలో జరిగిందో పార్టీ అధినేతకు తెలియంది కాదు. ప్రభుత్వంలోని తాసీల్దారుపై సొంత ఎమ్మెల్యే ఒకరు చేయి చేసుకుంది కూడా ఇసుక దందాను అడ్డుకున్నందువల్లేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సొంత జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలంలో ఇసుకదందా పై పోలీసులకు విన్నవించుకోవటానికి వచ్చిన పలు గ్రామాల ప్రజలపై లారీ దూసుకెళ్లి అక్కడికక్కడే 20మంది చనిపోవడం కేవలం ఇసుక దందా వల్లే. అక్కడ ఇసుక దందా చేస్తోంది మండల టీడీపీ అధ్యక్షుడేనని రుజువై చిరంజీవుల నాయుడు, ఆయన సోదరుడు ధనుంజయుల నాయుడును పార్టీ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపిన ఈదుర్ఘటన 2017 ఏప్రిల్21న జరిగింది. టీడీపీ హయాంలో ఇసుక దందా ఏస్థాయిలో జరిగిందో అని చెప్పడానికి ఇది ఓ ఉదాహరణ. మృతులకు, క్షతగాత్రులకు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారే కానీ రాష్ట్రంలో ఎక్కడా ఇసుక దందాను అడ్డుకోలేకపోయారు. ఎన్నికల్లో ఈ అంశం పార్టీపై తీవ్ర ప్రభావాన్నే చూపింది.

తీవ్రమైన విషయాలకు స్పందించే సీఎం హోదాలో ఉండి కూడా టీడీపీ అధినేత ఆ రోజు ఏర్పేడు బాధితులను ఎందుకు పరామర్శించ లేదో అర్ధంకాని పరిస్థితి. గెజిటెడ్ ర్యాంకు అధికారిపై దాడి చేసిన సొంత ఎమ్మెల్యేపై కనీస చర్యలు తీసుకోలేదు. ఇసుక ఉచితం ప్రజలకు లాభిస్తుందనుకుంటే.. సొంత పార్టీ నాయకులకు అవకాశం ఇచ్చారని తర్వాత పరిస్థితులు తెలియజేశాయి. ఇప్పుడు మాత్రం వైసీపీ నాయకులు ఇసుకదందా చేస్తున్నారు అని చంద్రబాబు అనటం ఎంతవరకూ సబబో ఆలోచించాలి.. నిజమైన ఆత్మపరిశీలన చేసుకోవాలి.