టీఆర్ఎస్ @20 ఏళ్ల ప్రస్థానం..ఒక్కడితో మొదలై నేడు లక్షల సైన్యంగా..

TRS @ 20 years of rule .. starting with one and today as an army of lakhs ..

0

స్వాతంత్య్రానంతరం తెలుగు నేలపై ఆవిర్భవించిన రెండు పార్టీలు మాత్రమే 20 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నాయి. అందులో ఒకటి ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం అయితే రెండోది తెలంగాణ రాష్ట్ర సమితి. స్వరాష్ట్ర సాధన కోసం 2001 ఏప్రిల్‌లో కేసీఆర్‌ ఒక్కడిగా బయల్దేరారు. ఇప్పుడు అక్షరాలా 75 లక్షల కార్యకర్తల సైన్యం ఆయన వెంట నడుస్తోంది. జాతీయ పార్టీలుగా చెలామణీ అవుతున్న అనేక రాజకీయ పక్షాల కన్నా శాసనసభలో, పార్లమెంటులో తెరాస సంఖ్యాబలమూ ఎక్కువే. అందరి అంచనాలనూ అధిగమిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి నేడు ద్విదశాబ్ది ఉత్సవాలను జరుపుకొంటోంది. స్వతంత్ర భారత రాజకీయ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకుంది.

2001 ఏప్రిల్‌ 27న కేసీఆర్‌ అధ్యక్షతన 12 మంది ప్రతినిధులతో తెరాస ఆవిర్భవించింది. ఆ తర్వాత జరిగిన పలు ప్లీనరీల్లో ఆయన అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మరోసారి ఆయనే అధ్యక్షుడు కానున్నారు. దేశంలో సుదీర్ఘకాలం పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్న వారిలో కేసీఆర్‌ ఒకరు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా కేసీఆర్‌ ఉపసభాపతి, సిద్దిపేట ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తెరాసను స్థాపించారు. ఆ తర్వాత ఉద్యమ పంథాలోనే పార్టీని నడిపించారు.

ద్విదశాబ్ది ఉత్సవాల సందర్భంగా సంస్థాగత పటిష్ఠతపై తెరాస దృష్టి సారిస్తోంది. బస్తీ, గ్రామ, మండల, డివిజన్‌ కమిటీల ఎన్నికలను నిర్వహించింది. జిల్లా, రాష్ట్ర కమిటీలు రానున్నాయి. పార్టీ శ్రేణులకు శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. దీని కోసం అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మించారు. పార్టీయే సర్వస్వంగా పనిచేస్తూ, ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా శ్రేణులు ఉండాలని తెరాస భావిస్తోంది. తమిళనాడులోని డీఎంకే, అన్నాడీఎంకే తరహాలో పార్టీ పటిష్ఠానికి త్వరలో మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here