తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ఆమె హైదరాబాద్‌కు చేరుకున్నారు. అంతా విమానంలో వస్తారేమో అనుకుంటే ఆమె మాత్రం సాదాసీదాగా రైళ్లో వచ్చారు. ఆ తర్వాత గాంధీ భవన్‌లో పార్టీ నేతలతో సమామేవశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ‘‘ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నాం.. పేద వాడి కోసం పని చేయాలి. పేదల మొఖంలో నవ్వులు చూడాలి.. అప్పుడే మనం పని చేసినట్టు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంతో పోరాట శక్తి ఉంది.. అనేక రకాలుగా పోరాటాలు చేసాము.. అందుకే తెలంగాణలో అధికారంలోకి వచ్చాము.
రాహుల్ గాంధీ(Rahul Gandhi) రాజ్యాంగ రక్షణ కోసం భారత్ జొడో యాత్ర నిర్వహించి ఒక మైదానాన్ని తయారు చేశారు. మనం దాని కోసం పోరాటం చేయాలి. బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలతో మనం ఇక్కడ పోరాటం చేయాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాటం చేసి స్వాతంత్రాన్ని తెచ్చింది. కాంగ్రెస్ ఎలాంటి పోరాటానికి అయిన సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇవన్నీ ప్రజలకు సక్రమంగా అందాలి. పదేళ్లు గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి పని చేశారు. వారికి న్యాయం జరగాలి.. పదవులు పొందిన వారు ప్రజల కోసం పని చేయాలి.
మనం చేసిన పనులను ప్రజలకు వివరించాలి. దేశంలో ఎక్కడా లేని విదంగా ఇక్కడ కులగణన చేపట్టాము.. ఇది చాలా గొప్ప విషయం. ప్రతి గ్రామ గ్రామానికి వెళ్లి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలి. గ్రామ గ్రామన పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలి. ఈ విషయంలో పీసీసీ ఒక పకడ్బందీగా కాలెండర్ సిద్ధం చేయాలి’’ అని తెలిపారు. ప్యారాచూట్ నేతలకు పదవులు ఇవ్వటం సాధ్యంకాదన్నారు. కష్టపడి పనిచేసిన నేతలకే పార్టీలో స్ధానముంటుందన్నారు. ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం చాలా అవసరమన్నారు. పార్టీ పటిష్టం కోసం నేతలు, క్యాడర్ అంతా ఏకతాటిపై నడవాలని Meenakshi Natarajan చెప్పారు.