Postcard Movement | తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ సర్కార్ సరిగా అమలు చేయడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్.. ఇప్పుడు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కొన్ని పథకాలను అమలు చేసినా వాటి వల్ల లబ్ధి పొందుతున్న వారి సంఖ్య పదుల్లోనే ఉందని అన్నారు. కాంగ్రెస్ హామీలను నమ్మి మహిళలు మోసపోయారని, ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పిన కాంగ్రెస్ సరిపడా బస్సులు ఏర్పాటు చేయలేదని విమర్శలు గుప్పించారు.
తెలంగాణ జాగృతి(Telangana Jagruthi) ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు ఇచ్చిన హామీల అమలు కోసం ‘పోస్ట్ కార్డ్’ ఉద్యమాన్ని(Postcard Movement) ప్రారంభించారు కవిత. దాదాపు 10వేల పోస్ట్ కార్డులను సేకరించారు కవిత. వీటన్నింటిని సీఎం రేవంత్‌కు(Revanth Reddy) పంపారు. వీటిలో మహిళలకు అందాల్సిన పథకాలు, వారికి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను రాశారు.
ఈ సందర్భంగా కవిత(MLC Kavitha) మాట్లాడుతూ.. ‘‘10 వేల పోస్టు కార్డులను సేకరించి పంపిస్తున్నాం. హామీల అమలుపై మార్చి 8న ప్రకటన చేయకపోతే 10 వేల మహిళలం 10 వేల గ్రామాల్లోకి వెళ్తాం. లక్షలాది పోస్టు కార్డులను తయారు చేసి సోనియా గాంధీకి పంపిస్తాం. మహిళలకు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదు. ఆడబిడ్డల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదు. సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ మాట్లాడక ముందే మహిళా బిల్లు కోసం తెలంగాణ జాగృతి ఢిల్లీలో ధర్నా చేసింది. మహిళా బిల్లు రావడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలుకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదు’’ అని తెలిపారు.