వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయ(Mamnoor Airport) అభివృద్ధికి కేంద్రం ఇటీవల ఆమోదం తెలిపింది. విమానాశ్రయ అభివృద్ధి కోసం అదనంగా 250 ఎకరాల భూమి కావాలని, దానిని రాష్ట్రప్రభుత్వం త్వరితగతిన సేకరించాలని కేంద్రం తెలిపింది. దీంతో రాష్ట్రప్రభుత్వం ఆఘమేఘాలపైన భూసేకరణ పనులను ప్రారంభించింది. ఇందులో భాగంగానే పలువురు అధికారులు వరంగల్(Warangal) చేరుకుని భూసర్వే ప్రారంభించారు. కాగా, వారికి రైతుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. భూసేకరణ పనులను రైతులు అడ్డుకున్నారు. ప్రభుత్వ తీరుతో తమకు అన్యాయం జరుగుతుందని రైతులు వాపోతున్నారు.
‘‘మేము విమానాశ్రయం(Mamnoor Airport) అభివృద్ధికి వ్యతిరేకం కాదు. ఇక్కడ విమానాశ్రయం రావడం సంతోషకరమైన అంశమే. కానీ దాని వల్ల మాకు అన్యాయం జరగకూడదు. ఎయిర్‌పోర్ట్ వల్ల ఎంత లాభపడుతున్నామో.. అంతకన్నా ఎక్కువ నస్టపోతున్నాం. మాకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను కోరుతున్నాం. మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం అందిస్తామని, రైతులు కోరుకున్న ప్రాంతంలో వ్యవసాయ ఆమోద యోగ్యమైన భూములు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు మాత్రం భూములకు భూమి ఇవ్వడం లేదు. అంతేకాకుండా మా గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గాన్ని కూడా మూసివేస్తున్నారు’’ అని రైతులు పేర్కొన్నారు.