ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు. సీసీఐ ఫ్యాక్టరీని చవకగా అమ్మేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోందని, సీసీఐని పునఃప్రారంభిస్తామని పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో హీమీ ఇచ్చి, ఓట్లు దండుకున్న బీజేపీ(BJP).. ఇప్పుడు ఆ సంస్థనే స్క్రాప్ కింద అమ్మాలనుకోవడం దారుణమన్నారు. బీజేపీ ప్రయత్నం తప్పకుండా ప్రజలను వంచించడమేనని కేటీఆర్ విమర్శించారు. బీజేపీ అంటే నమ్మకం కాదు.. బీజేపీ అంటే అమ్మకమని విమర్శలు గుప్పించారు కేటీఆర్.
‘‘సీసీఐ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని ఉద్యోగులు, కార్మికులు నిరసనలు చేస్తున్నారు. వారి ఆర్థనాదాలు కేంద్రం ప్రభుత్వానికి వినిపించడం లేదా? 772 ఎకరాల భూమి, 170 ఎకరాల టౌన్‌షిప్, 48 మిలియన్ టన్నుల టైమ్ స్టోన్ నిల్వలతో సకల వనరులు ఉన్న సంస్థ సీసీఐ. అటువంటి దానిని అంగడి సరుకుగా మార్చిన పాపం మోడీద’’ అని మండిపడ్డారు కేటీఆర్(KTR).