కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి(Rahul Gandhi) ఉత్తర్‌ప్రదేశ్ న్యాయస్థానం రూ.200ఫైన్ విధించింది. ఇందుకు 2022లో వీర్ సావర్కర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలే కారణం. 2022లో మహారాష్ట్రలో జరిగిన ఓ సభలో రాహుల్ గాంధీ.. వీర్ సావర్కర్‌ను(Veer Savarkar) ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవే ఇప్పుడు రాహుల్‌కు తిప్పలు తెచ్చాయి. వీర్ సావర్కర్ బ్రిటీష్ సేవకుడని, వారి నుంచి పెన్షన్ కూడా తీసుకున్నారంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ఆయన మాటలతో మనసునొచ్చుకున్న నృపేంద్ర పాండే అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రాహుల్ గాంధీ(Rahul Gandhi) మాటలు వీర్ సావర్కర్‌ను కించపరిచేలా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం జరిపిన విచారణకు రాహుల్ వరుసగా గైర్హాజరవుతూ వచ్చారు. తాజాగా జరిగిన విచారణకు కూడా రాహుల్ రాలేదు. ఆయన తరపు న్యాయవాది ప్రన్షు అగర్వాల్ వాదనలు వినిపిస్తూ.. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ బిజీగా ఉన్నారని, కాబట్టి వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు మినయాహింపు ఇవ్వాలని కోరారు. ఆ అభ్యర్థనతో ఆగ్రహించిన న్యాయస్థానం రాహుల్ గాంధీకి రూ.200 ఫైన్ విధించింది. అంతేకాకుండా తదుపరి విచారణకు ఆయన తప్పకుండా రావాలని లేని పక్షంలో రాహుల్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని న్యాయస్థానం హెచ్చరించింది.