తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) తీవ్ర విమర్శలు చేశారు. ఆయనవన్నీ గాలి మాటలేనన్నారు. వాటికి మేం సమాధానం చెప్పాలా? అని ప్రశ్నించారు. అంతవసరం తమకు లేదని వ్యాఖ్యానించారు. ‘‘సీఎం గాలి మాటలకు సమాధానం, సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ నాపై ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేశారు. ఆ ఆరోపణలకు ప్రజలే సమాధానం ఇచ్చారు. ప్రజా తీర్పు కాంగ్రెస్ పాలనకు చెంపపెట్టులాంటిది.
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ అమలు చేయాలి. యువతకు నిరుద్యోగ భృతి, ఆడబిడ్డలకు నెలకు రూ. 2500, దళితులకు రూ.12 లక్షలు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ హామీలు ఇచ్చింది. వాటిని సంపూర్ణంగా అమలు చేయాలి. జీవో 317 కారణంగా ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి’’ అని కిషన్ రెడ్డి(Kishan Reddy) కోరారు.