White Rice | అన్నం.. భారతదేశంలో ఇది సర్వసాధారణం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రంలో అన్నం తినడం మామూలు విషయం. అందులోనూ దక్షిణాదిలో అయితే రోజుకు మూడు పూటలా అన్నమే తినంటారు. ఇక్కడి నేలలు కూడా వరి పంటలకు చాలా అనుకూలంగా ఉంటాయి. దక్షిణాదిలో భోజనం అంటే అన్నమే గుర్తుకొస్తుంది. అందుకే అన్నాన్ని వాళ్లు పరబ్రహ్మ స్వరూపం అంటారు. ప్రతిరోజూ కనీసం రెండు పూటలా అయినా అన్నం తినడం ఇక్కడ సాధారణ అలవాటు కానీ, ఇలా తినేవారిలో ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.
చాలా మంది వైద్యులు.. అనేక ఆరోగ్య సమస్యలకు వైద్యంలో భాగంగా తెల్లన్నం తినడం తగ్గించాలని, భోజనం చేసే ప్లేట్‌ను అన్నంతో కాకుండా ఆరోగ్యంతో నింపుకోవాలని చెప్తారు. అన్నం పరిమాణం తగ్గించి.. ఆ స్థానంలో ఆరోగ్యకరమైన ఆహారం చేర్చుకోవాలని చెప్తున్నారు నిపుణులు. రోజు మూడు పూటల అన్నం తింటుంటే మాత్రం తిప్పలు తప్పవని చెప్తున్నారు. ఇంతకీ ఆ సమస్యలేంటో తెలుసా..
కొవ్వు పెరుగుతుంది: తెల్లన్నం(White Rice) తినడం వల్ల కొవ్వు అధికంగా పెరుగుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అతితక్కువ సమయంలోనే భారీగా పెరుగుతాయి. ఈ విషయం అందరికీ తెలుసు. అయినా అలవాటైపోయిందని అన్నమే తినడానికి ఇష్టపడతారు. అయితే దీనికి సైంటిఫిక్‌గా మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ఆధారం లేదు. అయితే తెల్లన్నంలో అధికంగా ఉండే కార్పోహైడ్రేట్‌లు కొవ్వు పెరగడానికి ఇంధనంలా పనిచేస్తాయని, అది కాస్తా అనారోగ్య కొవ్వును పెంచుతుందని వైద్యులు అంటున్నారు.
బరువు పెరిగుదల(Weight Gain): అన్నం మూడు పూటలా తినడం వల్ల బరువు వేగంగా పెరుగుతాం. ఎవరైనా బరువు ఊహించని రీతిలో పెరుగుతుంటే అందుకు వారు తింటున్న అన్నమే కారణమని చెప్పొచ్చని వైద్యులు అంటున్నారు. దీని అర్థం మీరు తింటున్న అన్నం అందిస్తున్న కార్పొహైడ్రేట్స్‌ను ఖర్చు చేసే స్థాయిలో శారీరిక శ్రమ చేయడం లేదని దీని అర్థమంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అయితే అన్నం తినే అలవాటు మహిళల్లో థైరాయిడ్, పీసీవోడీ వంటి సమస్యలు కూడా కారణం కావచ్చు. ఇలాంటి మెడికల్ హిస్టరీ లేని వారు సులువుగా బరువు తగ్గాలంటే కూరలు ఎక్కువగా తీసుకుని అన్నానికి బదులు ఫైబర్ ఎక్కువగా ఉండే చపాతీలు, జొన్నరొట్టెలు వంటివి కూడా తీసుకోవచ్చు.
గుండె సమస్యలు(Heart Problems): వైట్ రైస్ లో పోషకాలు తక్కువ స్థాయిలో ఉండి కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ గుండె ఆరోగ్యాన్ని కూడా మెల్లిగా దెబ్బతీస్తుంటాయి. రోజూ అన్నం మాత్రే తినేవారిలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలు, చెడు కొలెస్ట్రాల్స్ వేగంగా పెరుగుతుంటాయి. ఇవన్నీ గుండె సంబంధిత అనారోగ్యాలకు దారితీసే ప్రమాదం ఉంది. అన్నాన్ని ఇష్టపడే వారు వైట్ రైస్ కి బదులుగా బ్రౌన్ రైస్ ను డైట్ లో యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అధిక గ్లైసెమిక్ ఇండెక్స్: దీర్ఘకాలం పాటు ఇతర పోషకాలను తగ్గించి అన్నం మాత్రమే పుష్ఠిగా తినేవారు కచ్చితంగా ఇది తెలుసుకోవాలి. బియ్యానికి గ్లైసెమిక్ ఇండెక్స్ శాతం ఎక్కువ. రైస్ మాత్రమే తినేవారిలో రక్తంలో చక్కర శాతం వేగంగా పెరుగుతుంది. అదే షుగర్ వ్యాధికి దారితీస్తుంది. ఇక ఇప్పటికే షుగర్ ఉన్నవారు కూడా అన్నాన్ని తగ్గించి తీసుకోవడమే చాలా ఉత్తమం.
జీవక్రియకు ఆటంకం: రోజూ అన్నమే తింటే అది క్రమంగా మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ ను పెంచుతుంది. అంటే జీవక్రియను నెమ్మదించేస్తుంది. దీని కారణంగానే బరువు పెరిగిపోవడం, జీర్ణాశయ సంబంధ సమస్యలు బయలుదేరుతుంటాయి. అందుకే వైట్ రైస్ ను తగిన మోతాదుకు మాత్రమే పరిమితం చేయాలంటున్నారు వైద్య నిపుణులు.