తెలంగాణ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) ప్రసంగం అంతా అబద్ధాలే ఉన్నాయని మాజీ మంత్రి కేటీఆర్(KTR) వ్యాఖ్యానించారు. గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించడం దారుణమాన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం ఇలా చేసిందని ఎద్దేవ చేశారు. అసెంబ్లీలో ఈరోజు ఇచ్చింది గవర్నర్ ప్రసంగంలా లేదని.. గాంధీ భవన్‌లో కాంగ్రెస్ కార్యకర్త ప్రసంగంలా ఉందని ఎద్దేవా చేశారు.
ఈ ప్రసంగం ద్వారా గవర్నర్ స్థాయిని దిగజార్చారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు, మహిళలు, గురుకుల విద్యార్థులు అంతా నానా కష్టాలు పడుతున్నారని, వారి కష్టాల గురించి కనీసం మాట్లాడకపోవడం దురదృష్టకరమని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల గురించి మాట్లాడతారేమో అని తాను ఆశించానని, కానీ వాటి ఊసే లేకపోవడం దారుణమని అన్నారు. రైతులకు భరోసా ఇచ్చేలా ఒక్క మాట కూడా లేదని KTR పేర్కొన్నారు.