కేంద్రం, తమిళనాడు(Tamil Nadu) మధ్య భాషా వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హిందీ భాషకి వ్యతిరేకంగా మరో సంచలన అడుగు వేసింది. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం గురువారం నాడు 2025-26 సంవత్సరానికి బడ్జెట్ లోగోను విడుదల చేసింది. అయితే ఈ లోగోలో భారత రూపాయి చిహ్నాన్ని తమిళ అక్షరంతో భర్తీ చేయడం గమనార్హం. ఈ చర్యతో రాష్ట్ర బీజేపీ స్టాలిన్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాగా, తమిళనాడు ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు(Thangam Thennarasu) శుక్రవారం 2025-26 సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో బడ్జెట్ లోగోపై తమిళ పదం ‘రుబాయి’ మొదటి అక్షరం ‘రు’ ఉంది. ఇది స్థానిక భాషలో భారతీయ కరెన్సీని సూచిస్తుంది. లోగోపై “అందరికీ ప్రతిదీ” అనే శీర్షిక కూడా ఉంది. ఇది DMK ప్రభుత్వ సమ్మిళిత పాలన నమూనా అని పేర్కొంది. ఈ చర్యను బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై(Annamalai) తప్పుబట్టారు.
“2025-26 సంవత్సరానికి DMK ప్రభుత్వ రాష్ట్ర బడ్జెట్ ఒక తమిళుడు(Tamil Nadu) రూపొందించిన రూపాయి చిహ్నాన్ని భర్తీ చేస్తుంది. దీనిని భారతదేశం మొత్తం స్వీకరించి మన కరెన్సీలో చేర్చారు. చిహ్నాన్ని రూపొందించిన తిరు ఉదయ్ కుమార్, మాజీ DMK ఎమ్మెల్యే కుమారుడు. మీరు ఎంత తెలివితక్కువవారు స్టాలిన్(MK Stalin)?” అని ఆయన సోషల్ మీడియా పోస్ట్ లో ప్రశ్నించారు. భారత రూపాయి చిహ్నం ఉన్న 2024-25 తమిళనాడు బడ్జెట్ లోగోను కూడా ఆయన షేర్ చేశారు.