Revanth Reddy – Gummadi Narsaiah | ఐదు సార్లు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టినా ఇప్పటికీ వ్యవసాయ పనులు చేసుకుంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న నేత గుమ్మడి నరసయ్య. ఆయనకు ఫిబ్రవరి నెలలో తీవ్ర అవమానం జరిగిందని, సీఎంను కలవడానికి వెళ్లిన ఆయనను గంటల తరబడి ఎండలో నిలబెట్టిన ఘటన రాష్ట్రం మొత్తాన్ని కదిలించింది. అయితే ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ అంశం తెరపైకి వచ్చింది. సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు ఈ వియంపై సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కలవడానికి వచ్చిన గుమ్మడి నరసయ్యను సీఎం ఎందుకు కలవలేదు? అపాయింట్‌మెంట్ కూడా ఎందుకు ఇవ్వలేదు? అని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు. గుమ్మడి నరసయ్యలాంటి నాయకుడు వస్తే.. కలవలేకున్నాన్న సమాచారం కూడా ఇవ్వకుండా బయట ఎండలో నిల్చోబెట్టడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. కాగా కూనంనేని అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సమాధానమచ్చారు.
‘‘గుమ్మడి నరసయ్య(Gummadi Narsaiah) అంటే నాకు ఎనలేని గౌరవం ఉంది. ఆయన విషయంలో జరిగిన విషయం చాలా బాధించింది. అది అనుకోకుండా జరిగిన అంశమే కానీ మరొకటి కాదు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తర్వాత తనకు విషయం తెలిసింది. వెంటనే ఆఫీసు నుంచి ఆయనకు ఫోన్ చేయించాను. కానీ అప్పటికే ఖమ్మం చేరుకున్నట్లు గుమ్మడి నరసయ్య చెప్పారు. తర్వాత కలుస్తానని ఆయన చెప్పారు’’ అని అన్నారు. అదే విధంగా తనను కలవడానికి వచ్చే నేతలు ఇకపై సాయంత్రం సమయంలో రావాలని సూచించారు.