మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీతంపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి వచ్చింది రెండు రోజులు అయితే తీసుకున్న జీతం మాత్రం రూ.57,84,124 అని పేర్కొన్నారు సీఎం రేవంత్. తమ సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తాలని ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. కేసీఆర్(KCR) మాత్రం వర్క్ ఫ్రం ఫామ్ హౌస్ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలు అంటే పైనుంచి దిగొచ్చిన వారు కాదని, వారు కూడా ప్రభుత్వ ఉద్యోగులేనని సుప్రీంకోర్టు విషయాన్ని కేసీఆర్ మరిచారా అని అన్నారు.
‘‘అసెంబ్లీకి కేసీఆర్ వచ్చింది రెండు సార్లే. కానీ, తీసుకున్న జీతం మాత్రం రూ.57,84,124. డిసెంబర్ 2023 నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు దాదాపు 15 నెలలుగా ఆయన తీసుకున్న ప్రభుత్వ సొమ్ము ఇది. ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ, కేసీఆర్ మాత్రం రెండే రెండు సార్లు అసెంబ్లీకి వచ్చారు. ప్రజా సమస్యలపై ప్రస్తాంచిన సందర్భాలు ఏమీ లేవు. కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోం వెసులుబాటు ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. రాజకీయాల్లో వర్క్ ఫ్రంహోం, వర్క్ ఫ్రమ్ ఫామ్ హౌస్ అనేది ఏమైనా ఉందా? ఆయన తన బాధ్యతలు ఏమీ నెరవేర్చడం లేదు. ఎక్కడా సభలు కూడా పెట్టలేదు. ప్రజల సమస్యలు తెలుసుకోలేదు’’ అని Revanth Reddy అన్నారు.