ఉస్మానియా యూనిర్సిటీలో(Osmania University) ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువుగా ఉన్న చారిత్రాత్మక ఆర్ట్స్ కళాశాల క్యాంపస్ లో సోమవారం నుంచి నిరసనలు నిషేధిస్తూ వర్సిటీ సర్క్యులర్ జారీ చేసింది. దీనికి నిరసనగా బంద్ కు పిలుపునిచ్చినందుకు స్థానిక పోలీసులు అనేక మంది విద్యార్థులను ఈడ్చుకెళ్లి అరెస్టు చేయడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో టెన్షన్ నెలకొంది. పెద్ద సంఖ్యలో పోలీసులు ఆర్ట్స్ కళాశాల భవనంలోకి ప్రవేశించి ఐదుగురు ABVP విద్యార్థి కార్యకర్తలను అరెస్టు చేశారు. అరెస్టులకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
సర్క్యులర్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్ట్స్ కళాశాల(Osmania University) నుండి అనేక మంది జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ర్యాలీ చేపట్టారు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు పలువురు విద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేశారు. పోలీసుల అరెస్టులు క్యాంపస్‌లో తమ ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడకుండా ఆపలేవని ABVP జాతీయ కార్యవర్గ సభ్యుడు, తెలంగాణ విశ్వవిద్యాలయాల సమన్వయకర్త జీవన్ అన్నారు. రాబోయే 24 గంటల్లో సర్క్యులర్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, రద్దు చేయకపోతే విద్యార్థులు తీవ్రంగా పోరాడతారని జీవన్ హెచ్చరించారు.