Betting App Promoters | తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నవారిపై చర్యలకి దిగింది. ఈ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిని వదిలిపెట్టేది లేదని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన సినీనటులు, టీవీ యాంకర్లపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మందిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ఎవరెవరు ఏ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారనే దానిపై ఆరా తీస్తున్నామని డీసీపీ వెల్లడించారు. నటీనటుల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చూసి బెట్టింగ్ ఆడిన వారి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారందరిని పిలిచి విచారిస్తామన్నారు. సినీనటులు, యాంకర్లు అవసరమైన వారిపైన చర్యలు కూడా తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
బెట్టింగ్ యాప్స్ బారిన పడి దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కానీ వీటిని ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు మాత్రం భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. సామాజిక కార్యకర్తలు ఎప్పటి నుంచో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న యూట్యూబర్ అన్వేష్ ఈ ఇష్యూపై చాలారోజులుగా ఫైట్ చేస్తున్నారు. తాజాగా ఐపీఎస్ ఆఫీసర్, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ పై గళం విప్పారు. దీంతో తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్ పై చర్యలకి సిద్ధమయ్యారు.
అందులో భాగంగా… 11 మంది యూట్యూబర్లపై సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న(Betting App Promoters) యాంకర్ శ్యామల, హర్షసాయి, విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, రీతు చౌదరి, టేస్టీ తేజ, అజయ్, కిరణ్ గౌడ్, బయ్యా సన్నీ యాదవ్, సుధీర్ రాజులపై కేసులు నమోదుచేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి నిర్వాహకుల నుంచి వీరు డబ్బులు తీసుకుంటున్నారు. కానీ, వీరిని ఫాలో అయ్యి బెట్టింగ్ యాప్స్ లో బెట్టింగ్స్ కి అలవాటు పడి ఎంతోమంది అమాయకులు డబ్బులు కోల్పోయి, అప్పుల పాలై ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు.