గాజా(Gaza) మరోసారి గజగజలాడింది. ఇజ్రాయెల్(Israel) దాడులతో దడదడలాడింది. ఈ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 400 దాటింది. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపుపై మంతనాలు జరుగుతుండగా మళ్ళీ దాడులు జరగడం కీలకంగా మారింది. ఇజ్రయేల్ విరుచుకుపడిన దాడుల్లో మృతుల సంఖ్య క్షణక్షణానికి పెరుగుతోంది. ఈ దాడుల్లో కనీసం 404 మంది మరణించి ఉంటారని గాజా ఆరోగ్యశాఖ అంచనా వేసింది. మరో 562 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది.
ఖాన్ యూనిస్, రఫా, ఉత్తర గాజా(Gaza), గాజా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ తన వైమానిక దాడులు చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన వారిలో అధికసంఖ్య మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు గాజా ఆరోగ్యశాఖ పేర్కొంది. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నట్లు అంచనా వేస్తున్నారు. తొలుత చేసిన ప్రకటనలో మరణాలు, గాయపడిన వారి సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ, ఆ తర్వాత గాజా ఆరోగ్యశాఖ వాటిని సవరించింది.