భారత్(India), బంగ్లాదేశ్(Bangladesh) మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) థాయిలాండ్‌లో బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్‌తో(Muhammad Yunus) సమావేశం నిర్వహించారు. గత ఆగస్టులో షేక్ హసీనా పాలన పదవీచ్యుతమైన తర్వాత వీరి భేటీ ఇదే మొదటిసారి. ప్రధాని మోడీతో సమావేశం కోరిన బంగ్లాదేశ్ ప్రభుత్వం.. ఈ సమావేశంలో పదవీచ్యుతురాలైన ప్రధానమంత్రి షేక్ హసీనాను(Sheikh Hasina) అప్పగించడం, గంగా జల ఒప్పందం గురించి ప్రస్తావించింది. “ఇరు దేశాలకు సంబంధించిన అంశాలపై నాయకులు చర్చలు జరిపారు. షేక్ హసీనాను అప్పగించడం, భారతదేశం నుండి ఆమె చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలను కూడా యూనస్ లేవనెత్తారు” అని యూనస్ ప్రెస్ సెక్రటరీ తెలిపారు.
గురువారం బిమ్స్‌టెక్ నాయకుల విందులో మోడీ, యూనస్ ఒకరి పక్కన ఒకరు కూర్చోవడం ఆసక్తికరంగా మారింది. ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, ఇద్దరు నాయకులు ఫోటోలలో నవ్వుతూ కనిపించారు. వీరి కలయికలో మరో ఆసక్తికర పరిణామం కూడా చోటు చేసుకుంది. యూనస్ ప్రధాని మోదీకి ఓ త్రో బ్యాక్ ఫోటోని బహుకరించారు. 2015లో 102వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో నోబెల్ గ్రహీతకు ప్రధానమంత్రి బంగారు పతకాన్ని ప్రదానం చేస్తున్న ఫోటోను యూనస్ మోడీకి బహుకరించారు.
కాగా, భారతదేశం ఈశాన్య భూపరివేష్టిత పరిస్థితిని ప్రస్తావించి, ఈ ప్రాంతంలో చైనా తన ప్రభావాన్ని విస్తరించాలని యూనస్ కోరిన తర్వాత భారతదేశం ఆగ్రహం వ్యక్తం చేసిన కొన్ని రోజులకే ఈ సమావేశం జరగడం విశేషం. చైనా పర్యటన సందర్భంగా యూనస్, హిందూ మహాసముద్రానికి ఏకైక ద్వారం బంగ్లాదేశ్ అని ప్రస్తావించి అస్సాం ముఖ్యమంత్రి, విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి విమర్శలను సైతం ఎదుర్కొన్నారు. యూనస్ వ్యాఖ్యలు, అలాగే చైనాను బంగ్లాదేశ్ కొత్త భాగస్వామిగా చూపించాలనే అతని ప్రయత్నం, షేక్ హసీనా పాలనలో న్యూఢిల్లీ, ఢాకా మధ్య తెగిన సన్నిహిత సంబంధాలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ పదే పదే చేసిన అభ్యర్థనలను భారతదేశం పట్టించుకోకపోవడంతో ఈ దూరం ఏర్పడింది.
యూనస్ వ్యాఖ్యలకు మోడీ(PM Modi) నేరుగా స్పందించకపోయినప్పటికీ… భారతదేశ ఈశాన్య ప్రాంతం BIMSTEC గ్రూపునకు కేంద్రంగా ఉంది అని పరోక్షంగా జవాబిచ్చారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఈశాన్య ప్రాంతం కనెక్టివిటీ హబ్ గా అభివృద్ధి చెందుతోందని నొక్కి చెబుతూనే… సహకారం అనేది ఒక సమగ్ర దృక్పథమని, ఒకరి లాభాలకు లోబడి ఉండదని నొక్కి చెప్పారు.