తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై(Annamalai) సంచలన ప్రకటన చేశారు. తాను రాష్ట్ర బీజేపీ అధ్యక్ష రేసులో లేనని చెప్పారు. శుక్రవారం కోయంబత్తూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నికల్లో పోటీ చేస్తారా అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధమిచ్చారు. “నేను కొత్త రాష్ట్ర అధ్యక్షుడి రేసులో లేను… నేను ఎల్లప్పుడూ పార్టీకి మంచి జరగాలని కోరుకుంటున్నాను. నేను ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు పెద్దగా చెప్పదలచుకోలేదు. కొత్త రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక త్వరలో జరుగుతుంది. మీరు దాన్ని చూసి, ఆపై మాట్లాడవచ్చు” అని ఆయన అన్నారు.
బీజేపీలో పోటీ లేదని కూడా అన్నామలై(Annamalai) అన్నారు. “50 మంది నామినేషన్లు దాఖలు చేయడం, రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ ఉండటం లాంటిది కాదు. మేము ఏకగ్రీవంగా ఒక వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకుంటాము… అప్పుడు పోటీ ఎక్కడ ఉంది? అందుకే నేను పోటీలో లేనని చెప్పాను” అని ఆయన అన్నారు. “పార్టీ క్యాడర్‌గా నా పని కొనసాగుతుంది. అవినీతిపై పోరాడటానికి నేను వచ్చాను. దానిలో ఎటువంటి రాజీ లేదు… తమిళనాడులో ఏదో ఒక రోజు సుపరిపాలన తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతాయి” అని ఆయన అన్నారు. బీజేపీ ఒక జాతీయ పార్టీ. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. 2026 ఎన్నికలు తమిళనాడు ప్రజలకు ముఖ్యమైనవి. డిఎంకె పాలనలో ప్రజలు మరో ఐదు సంవత్సరాలు చిక్కుకోవాలా? నేను క్యాడర్‌గా పని చేస్తూనే ఉంటాను” అని ఆయన అన్నారు. అన్నామలై కేంద్ర మంత్రి అవుతారనే ప్రచారంపై స్పందిస్తూ ఇక్కడి నుండి బయటకు వెళ్లను అని తేల్చి చెప్పారు.