బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును సోమవారం న్యాయస్థానం కొట్టేసింది. ఈ కేసులో కేటీఆర్‌తో పాటు మరికొంతమందిపై మహాదేవ్‌పూర్ పీఎస్‌లో నమోదైన కేసులను కూడా కొట్టేసింది.
గతేడాది జూలైలో కేటీఆర్ సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. బీఆర్ఎస్ హయాంలో నాణ్యతా లోపంతో మేడిగడ్డ బ్యారేజి నిర్మించడం వల్ల వర్షాలకు బ్యారేజ్ దెబ్బతిందని, పిల్లర్లు కుంగాయని కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ అసత్య ఆరోపణలు చేస్తోందని, అవి అబద్ధమని తేలుస్తామని.. బీఆర్ఎస్ నేతల బృందం మేడిగడ్డ బ్యారేజ్ వద్ద క్షేత్ర పరిశీలనకు వెళ్లారు. అనంతరం బ్యారేజ్ కి ఎలాంటి డ్యామేజ్ జరగలేదని ఫోటోలు, డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అయితే అనుమతి లేకుండా ప్రాజెక్టును సందర్శించడంతో పాటు డ్రోన్ ఎగురవేశారని ఇరిగేషన్ అధికారి మహాదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ కంప్లైంట్ మేరకు పోలీసులు కేటీఆర్ సహా ఆయనతో ఉన్న శ్రేణులపై పలు సెక్షన్లు కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా మేడిగడ్డ బ్యారేజీ నిషిద్ధ ప్రాంతమేమీ కాదని కేటీఆర్ న్యాయవాది టీవీ రమణారావు వాదించారు. రాజకీయ కక్ష్యల కారణంగానే కేసు నమోదు చేశారన్నారు. డ్రోన్ ఎగురవేయడం డ్యాం భద్రతకే ప్రమాదమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. కేటీఆర్(KTR) తో పాటు ఇతర నాయకులపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.