తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు షాక్ ఇవ్వబమోతున్నారా? తెరాసా పార్టీని వీడి సొంత పార్టీలోకి వెళ్లబోతున్నారా? అంటే రాజకీయ వర్గాలు అవును అనేఅంటున్నాయి.
మహబూబ్‌నగర్ జిల్లా అంతటా ఇదే చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సొంత పార్టీ అభ్యర్థులను కాదని, తన అనుచరులతో వేరే పార్టీ నుంచి పోటీ చేయించి 11 మందిని గెలిపించుకున్న ఆయన.. ప్రస్తుతం తెరాసాకు గుడ్‌బై చెబుతారని పలువురు చర్చించుకుంటున్నారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన్ను సీఎం కేసీఆర్ పక్కన పెట్టారు.
అప్పటి నుంచి పెద్దగా వార్తల్లో నిలవని జూపల్లి.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తన అనుచరులకు మద్దతుగా ప్రచారం నిర్వహించడం గమనార్హం. అదీ.. తానున్న తెరాసాకు కాకుండా ఆలిండియా ఫార్వర్డ్ పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేశారు.
ఎన్నికలు ముగిసాక కేసీఆర్‌ను కలవాలనుకున్నారు, కానీ సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో పార్టీని వీడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కొల్లాపూర్ నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.