గాయకుడు, సంగీత దర్శకుడు సుమారు 40 వేలకు పైగా పాటు పాడిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నటుడుగా కూడా కొన్ని చిత్రాలు నటించారు… 1969 లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన ఈయన తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించాడు. తర్వాత అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించాడు. ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) మొదలైనవి ఆయన నటించిన కొన్ని సినిమాలు. బాలు డబ్బింగ్ ఆర్టిస్టుగా అనేకమంది కళాకారులకు గాత్రదానం చేశారు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వాళ్ళకి గాత్రదానం చేసాడు.
సినిమాల్లోనే కాక టి.వి రంగంలో ఆయన పాడుతా తీయగా, పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది నూతన గాయనీ గాయకులను పరిచయం చేశారు. ఇవి కాకుండా స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో తన గానాన్ని వినిపించాడు.
బాలుకు భారతదేశ కేంద్రప్రభుత్వం నుండి 2001 లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011 లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నారు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు. 2012 లో ఆయన నటించిన మిథునం సినిమాకు గాను నంది ప్రత్యేక బహుమతి లభించింది….