తిరుపతి అంటే దేవాలయాలకు ప్రసిద్ధి , ఎన్నో పురాతన దేవాలయాలకు నెలవు.. ఒకప్పుడు పూజా కైంకర్యాలతో కళకళలాడి, తరువాతి కాలములో జరిగిన దండయాత్రల కారణంగా పూజా పునస్కారాలు లేక శిథిలావస్థకు చేరిన దేవాలయాలు చాలా ఉన్నాయి. అలాంటి కోవ కి చెందిందే ఈ వకుళా మతా ఆలయం…
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల వేంకటేశ్వరుని తల్లిగా ఆమె అందరికీ సుపరిచితురాలే. అయితే విశ్వవ్యాప్తంగా నిత్యం కోట్లాది మంది భక్తులను తన సన్నిధికి రప్పించుకుంటున్న వేంకటేశ్వరస్వామి తన తల్లి బాగోగులు మాత్రం మరచిపోయారు..
దశాబ్దాల చరిత్ర కలిగిన కలియుగ దేవుడు తల్లి వకుళామాత ఆలయం మాత్రం అభివృద్ధి నోచుకోలేదు. తిరుపతికి సమీపంలో ఎంతో అపురూపమైన ప్రాంతంలో, పేరురు బండగా ప్రసిద్ధి చెందిన గుట్టపై నిర్మితమైన ఈ దేవాలయం నిత్య కైంకర్యాలతో ఒకప్పుడు కళకళలాడేది. అయితే ఏమైందో ఏమో ఆలయాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు.. వెంకన్నను దర్శించుకొనే కోట్లాది మంది భక్తులు.. వకుళామాత ఆలయ దుస్థితిపై ఆవేధన వ్యక్తం చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ ఏ రాజకీయ నాయకుడు దీని గురించి ఆలోచించలేదు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో వకుళామాత ఆలయానికి మంచి రోజులు వచ్చాయి.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత నిధులతో ఆలయంలో జీర్ణోద్ధరణ పనులు చేపడుతున్నారు. ఆలయంలో అభివృద్ధి పనులు వేగంగా జరిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు వీటిపై ఆరా తీస్తున్నారు. వకుళామాత ఆలయ గోపురానికి బంగారు తాపడం చేపిస్తున్నారు. అంతేకాకుండా ఆలయానికి వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి ఆలయం చుట్టూ పచ్చదనం ఉట్టిపడేలా అభివృద్ధి పనులు చేపడుతున్నారు.
దశాబ్దాల నుంచి ఎటువంటి అభివృద్ధికి నోచుకోని ఆలయం ఇప్పుడు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుండటంతో స్థానికులతో పాటు జిల్లా వాసులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వేగంగా పనులు జరుగుతున్న నేపథ్యంలో మరో మూడు నెలల్లో ఆలయం భక్తులకు అందుబాటులోకి వస్తుంది. వేంకటేశ్వర స్వామి దర్శనం కంటే ముందు వకుళా మాతను దర్శించుకోవడం ఆనవాయితీ అని, వకుళామాత ఆలయంపై ప్రత్యేక చొరవ తీసుకొని అభివృద్ధి చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భక్తులు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.
అయితే ఆయన గురించి తెలిసిన వారు మాత్రం ఆయనకు భక్తి ఎక్కువ.. అందుకే ఆలయ అభివృద్ధి కోసం సొంత నిధులు ఖర్చు చేస్తున్నారని అంటున్నారు. ఇందుకు నిదర్శనంగా పెద్దిరెడ్డి సొంత ఊరిలో అయ్యప్ప స్వామి స్వర్ణ ఆలయం కూడా నిర్మించారని గుర్తు చేసుకుంటున్నారు.
రాజకీయాల్లో ప్రజా సేవతో పాటు ఆలయాల అభివృద్ధికి పూనుకుంటున్న పెద్దిరెడ్డి కుటుంబం ఇటు ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న భక్తుల నుంచి కూడా ప్రశంశలు అందుకుంటుంది