గుచ్చుకున్న ఈటె : ఆ ప్రశ్నకు టిఆర్ఎస్ నుంచి సౌండ్ లేదా?

0
95

భూకబ్జా ఆరోపణలతో టిఆర్ఎస్ పార్టీ నుంచి తరిమేయబడ్డ నాయకుడు ఈటల రాజేందర్. 19 ఏళ్ళ బంధాన్ని తెంపుకున్న క్రమంలో శుక్రవారం తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఈటల ఉగ్రరూపం దాల్చారు. ఆయన తన రాజకీయ జీవితంలో చేసిన అద్భుతమైన ప్రసంగాల్లో టిఆర్ఎస్ కు వీడ్కోలు పలికిన ప్రెస్ మీట్ లో చేసిన ప్రసంగం కూడా ఒకటి. ‘‘40 సీట్లు పోటీ చేస్తే పట్టుమని 10 గెలవలేదు… తల ఎక్కడ పెట్టుకోవాలో తెలుస్తుందా? రాజేంద్రా నీకు…?’’ అని దశాబ్దం క్రితం సీమ అహంకారం హేళన చేసినప్పుడు అసెంబ్లీ వేదికగా ఈటల చేసిన ప్రసంగం ఇప్పటికీ తెలంగాణవాదులకు మతికి ఉన్నది. ఆవేదనలోంచి పుట్టుకొచ్చిన మాటలు ఈటెల్లా ఉంటాయనడానికి నిన్న జరిగిన ప్రెస్ మీట్ నిదర్శనం.

ఈటెల రాజేందర్ చేసిన ఆరోపణలకు 24 గంటలు గడుస్తున్నా.. టిఆర్ఎస్ నుంచి ఇంకా సమాధానం రాలేదు. ఈటల చేసిన కీలకమైన ఆరోపణల్లో ‘‘ప్రగతి భవన్ అనేది బానిస భవన్ లాగా మారిపోయింది… ఆ ప్రగతిభవన్ లో ఒక్క ఎస్సీ ఐఎఎస్ కానీ, ఒక్క ఎస్టీ ఐఎఎస్ కానీ, ఒక్క బిసి ఐఎఎస్ కానీ కొలువులో ఉన్నడా’’ అని సూటిగా ప్రశ్నించారు. నిన్న ఆయనతో సహచర మంత్రులుగా ఉన్న కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ మీడియా ముందుకొచ్చారు కానీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. ‘‘ఇగో ప్రగతి భవన్ లో ఇంతమంది ఎస్సీ అధికారులు, ఇంత మంది ఎస్టీ అధికారులు, ఇంత మంది బిసి ఐఎఎస్ లు పనిచేస్తున్నారు.. ఇది లిస్ట్’’ అని వెల్లడించలేకపోయారు. దీన్నిబట్టి ఈటల దాడికి జవాబు లేని స్థితిలో టిఆర్ఎస్ నాయకత్వం పడిపోయింది.

తెలంగాణ అనేది బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీల స్టేట్… 85 శాతంగా ఉన్న ప్రజానీకం ఉన్న బడుగు, బలహీన వర్గాలకు మేలు చేడయం కోసమే తెలంగాణ సాధించుకున్నం అని సిఎం కేసిఆర్ తొలినాళ్లలో చెప్పేవారు. కానీ తెలంగాణ అధికార కేంద్రం ప్రగతి భవన్ లో ఈ వర్గాలకు సంబంధించిన వారు ఒక్కరూ లేకపోవడం, దాన్ని ఈటల సూటిగా ప్రశ్నించడంతో టిఆర్ఎస్ నాయకత్వం ఆత్మరక్షణలో పడింది. ఆయా వర్గాల అధికారులు ప్రగతిభవన్ లో ఉండి ఉంటే ఈపాటికే లెక్కలు తీసి మీడియా ముందు పెట్టేవారే. కానీ లేరు… అందుకే సౌండ్ లేదని పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు.

కేసిఆర్ ఎంత గొప్ప వ్యూహచతురత కలిగిన నాయకుడైనా సరే… కొన్ని విషయాల్లో ఆయన వ్యవహార శైలిపై విమర్శలు సూటిగా తగులుతూనే ఉంటాయి. వాటికి ఏండ్లు గడిచినా జవాబులు మాత్రం దొరకవు. బ్రాహ్మణుడైన దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణలో పర్యటించిన సందర్భాల్లో కేసిఆర్ పాదాభివందనం చేసేవారు. అదే దళితుడైన ప్రస్తుత రాష్ట్రపతి రాంనాద్ కోవింద్ వచ్చిన సందర్భంలో షేక్ హ్యాండ్ మాత్రమే ఇచ్చేవారు. అలాగే బ్రాహ్మణుడైన మాజీ గవర్నర్ నరసింహన్ కు పాదాభివందనాలు చేసేవారు కేసిఆర్. కానీ ప్రస్తుత గవర్నర్ బిసి వర్గానికి చెందిన తమిళి సై కి చేతులు జోడించి నమస్కారం చేసేవారు. బ్రాహ్మణులకు పాదాభివందనాలు చేయడం చూసినా.. ప్రగతి భవన్ లో ఎస్సీ, ఎస్టీ, బిసి అధికారులకు కొలువులు లేవన్న ఈటల విమర్శలు చూసినా.. కొందరు ఎక్కువ సమానం, మరికొందరు తక్కువ సమానమా అన్న అనుమానాలు కలగక మానవు.