బాధ్యతలు చేపట్టిన యాదాద్రి జిల్లా కొత్త కలెక్టరమ్మ

Pamela Satpathy taken charge Collector of Yadadri district

0
94

యాదాద్రి భువనగిరి జిల్లా కొత్త కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. నాలుగేళ్లకు పైగా సుదీర్ఘ కాలం కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించిన అనితా రామచంద్రన్ నుంచి పమేలా సత్పతి బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా నూతన కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అమలు చేస్తామన్నారు. నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం పనిచేసి జిల్లా అభివృద్ధిలో కీలక భూమిక పోషించిన అనితారామచంద్రన్ నుంచి బాధ్యతలు తీసుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.
సిఎం కేసిఆర్ ఇచ్చిన బాధ్యతలు నెరవేరుస్తానని యాదాద్రి దేవాలయ అభివృద్ధితోపాటు హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను అమలు చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు. వరంగల్ మున్సిపల్ కమిషనర్ గానూ భద్రాచలం సబ్ కలెక్టర్ గానూ పనిచేసిన కాలంలో సాధించిన అనుభవాలను ఉపయోగించుకుని తన విధులను విజయవంతంగా నిర్వర్తిస్తానని అన్నారు. ప్రతిష్టాత్మక దేవాలయం యాదాద్రి లో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
సంతృప్తిగా వెళ్తున్నా : అనితా రామచంద్రన్
నాలుగేళ్ల ఎనిమిది నెలల పాటు యాదాద్రి జిల్లా కలెక్టర్ గా పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు మాజీ కలెక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు. నూతన జిల్లా కలెక్టర్ గా వచ్చిన పమేలా సత్పతికి సోమవారం బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆమె తన అనుభవాలను పంచుకున్నారు. తనకు ఇంతకాలం ఇక్కడ కలెక్టర్ గా పనిచేసేందుకు అవకాశం కల్పించిన సిఎం కేసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఎంతో సహకరించారని, అధికారులు తోడ్పాటు అందించారని చెప్పారు. తాను పనిచేసిన కాలంలో మల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధి, బస్వాపూర్ నర్సింహ్ జలాశయం, భునాదిగానే కాల్వ, ఎయిమ్స్, సిసిఎంబి తదితర ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు భూసేకరణ ఎంతో సంతృప్తి ఇచ్చిందన్నారు.
యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ పనుల విషయంలో రింగ్ రోడ్డు పనులకు భూసేకరణ కోసం ఇల్లు కోల్పోయిన వారికి పరిహారం చెల్లింపులో ఒప్పుకోనందు న ఎంతో బాధపడ్డానని, చివరికి వారు ఒప్పుకున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యతనిచ్చి అమలు చేశానని, పల్లె, పట్టణ ప్రగతి జిల్లాలో ధాన్యం సేకరణ గణనీయంగా చేపట్టినట్లు తెలిపారు.
సుమారుగా జిల్లాలో 15 వేల ఎకరాల భూ సేకరణ చేపట్టినట్లు తెలిపారు. బాధ్యతలతో ఒత్తిడి ఉన్నప్పటికీ ఒకే కుటుంబం లాగా కలిసి పనిచేసి జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఖీమ్యా నాయక్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.