తెలంగాణలో పేకాటపై కేసిఆర్ సర్కారు ఉక్కుపాదం మోపింది. పేకాటరాయుళ్లను పొలిమేరల నుంచి తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నది. రాష్ట్రం ఏర్పడి సర్కారు వచ్చిన వెంటనే పేకాట స్థావరాలను చిన్నాభిన్నం చేశారు.
అయితే అడపాదడపా అక్కడక్కడ కొందరు సంపన్న వర్గాలకు చెందిన వారు పేకాట ఆడుతున్నారు. అయితే వారిని సైతం వదలకుండా పట్టుకుంటున్నారు తెలంగాణ పోలీసులు. తాజాగా తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సోదరుడు నరసింహారెడ్డి పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుపడ్డారు.
నరసింహారెడ్డి సికింద్రాబాద్ లో పేకాట ఆడుతుండగా పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి అరెస్టు చేశారు. మల్లారెడ్డి సోదరుడితోపాటు మరో 10 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ కు అప్పగించారు.