కేసిఆర్ కాళ్లు మొక్కిన ఆ జిల్లా కలెక్టర్ : సోషల్ మీడియాలో రచ్చ

0
90

కాళ్లు మొక్కే కల్చర్ తెలంగాణలో బాగా పెరిగిపోయినట్లు కనబడుతన్నది. గతంలో సిఎం కేసిఆర్ రాష్ట్రపతి హోదాలో తెలంగాణకు వచ్చిన సందర్భంలో దివంగత నేత ప్రణబ్ ముఖర్జీ కాళ్లు మొక్కారు. గవర్నర్ గా పనిచేసిన నరసింహన్ కు సైతం కేసిఆర్ పాదాభివందనాలు చేశారు.

ఇక కేసిఆర్ మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కేటిఆర్, హరీష్ రావు లాంటివాళ్లు కేసిఆర్ కు పాదాభివందనాలు చేశారు. బర్త్ డే పేరుతో చాలామంది టిఆర్ఎస్ నేతలు ప్రగతిభవన్ కు వెళ్లి కేసిఆర్ కాళ్లు మొక్కి ఆశీర్వాదాలు తీసుకున్నారు. పదవి ఊడిపోయిన పిఆర్ఓ గటిక విజయ్ కుమార్ కూడా కేసిఆర్ కాళ్లు మొక్కిన దాఖలాలున్నాయి. కొందరు జర్నలిస్టులు సైతం కేసిఆర్ బర్త్ డే సందర్భంగా ఆయన కాళ్లు మొక్కిన ఘటనలు ఉన్నాయి.

ఇక ఈ కాళ్లు మొక్కే కల్చర్ అధికార యంత్రాంగంలోకి కూడా పాకింది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఊహించని రీతిలో సిఎం కేసిఆర్ కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకోవడం అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆదివారం సిఎం కేసిఆర్ జిల్లాల పర్యటనకు దిగారు. తొలుత ఆయన హైదరాబాద్ నుంచి హెలిక్యప్టర్ లో సిద్దిపేట వెళ్లారు. అక్కడ కలెక్టర్ కార్యాయంతోపాటు పలు కార్యాలయాలను ఓపెనింగ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఓపెనింగ్ సమయంలో కలెక్టర్ సీటులో జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని ఆశీనులు కావాలని కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా ఆయన సిఎం కేసిఆర్ కు పాదాభివందనాలు చేశారు. ఆ సమయంలో కేసిఆర్ స్వల్పంగా వారించే ప్రయత్నం చేశారు.

జిల్లా కలెక్టర్ సిఎం కాళ్ల మీద పడడం హాట్ టాపిక్ అయింది. ఒక జిల్లా కలెక్టర్ ప్రస్తుత ఎమ్మెల్సీ, కేసిఆర్ కుమార్తె దగ్గర మోకాళ్ల మీద కూర్చొని మాట్లాడడం అప్పట్లో రచ్చ రంబోలా అయింది. తాజాగా ఇప్పుడు సిద్దిపేట కలెక్టర్ కేసిఆర్ కాళ్లమీద పడడం ఏరకమైన చర్చకు దారితీస్తుందో చూడాలి.

కలెక్టర్ కేసిఆర్ కాళ్లు మొక్కే వీడియో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది.