శాంతించిన కోమటిరెడ్డి : తాజా స్టేట్ మెంట్ రిలీజ్

Mp komatreddy Venkatreddy Latest Statment

0
87

నిన్న ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగగానే అగ్గిమీద గుగ్గిలమైన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ శాంతించారు. నిన్న సాయంత్రం నుంచి ఆయన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎవరికీ అందుబాటులోకి రాలేదు. ఫోన్ స్విచ్ఛాప్ పెట్టారు. తాజాగా సోమవారం సాయంత్రం ఒక ప్రెస్ నోట్ జారీ చేశారు. తన ముందున్న లక్ష్యం ఏంటో ఆ ప్రకటనలో వెల్లడించారు. కోమటిరెడ్డి జారీ చేసిన ప్రెస్ నోట్ యదాతదంగా దిగువన ఇస్తున్నాం.. చదవండి.

ఇక‌పై ప్ర‌జా స‌మస్య‌లు తీర్చేందుకు ప్ర‌జ‌ల‌కు 24 గంట‌లు అందుబాటులో ఉంటాన‌ని.. త‌న‌ను రాజ‌కీయాల్లోకి లాగ‌వ‌ద్ద‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టి నుంచి రాజకీయప‌ర‌మైన‌ విష‌యాల‌పై ఎటువంటి వ్యాఖ్య‌లు చేయ‌న‌ని.. దానికి స‌హ‌క‌రించాల‌ని జ‌ర్న‌లిస్టుల‌ను కోరారు.

త‌ను భువ‌న‌గిరి ఎంపీ ఎన్నికైనా నుంచి అన్ని గ్రామాల్లో ప‌ర్య‌టించలేద‌ని.. క‌రోనా కాలంగా కొద్ది గ్రామాలకు మాత్ర‌మే వెళ్లిన‌ట్లు తెలిపారు. ఇక నుంచి భువ‌న‌గిరి, న‌ల్గొండ పార్ల‌మెంట్ ప‌రిధిలోని ప్ర‌తి గ్రామంలో ప‌ర్య‌టించి అక్క‌డ తిష్ట వేసిన స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని వాటి ప‌రిష్కారానికి కృషిచేస్తాన‌ని వివ‌రించారు. అలాగే గ్రామాల అభివృద్దికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో పోరాడి నిధులు తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని వెల్ల‌డించారు. గ్రామాల్లో చాలా స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని వాటిని ప‌రిష్కారానికి పూర్తిగా స‌మ‌యం కేటాయిస్తాన‌ని తెలిపారు.

అలాగే పూర్తిస్థాయిలో సేవా కార్యక్ర‌మాల మీదే దృష్టి పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ప్ర‌తీక్ ఫౌండేష‌న్ ద్వారా వీలైనంత ఎక్కువ‌గా సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతాన‌ని తెలిపారు. న‌ల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎవ‌రైనా త‌న తలుపు త‌ట్ట‌వ‌చ్చ‌ని వెల్ల‌డించారు.

ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం, ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు జాప్యం వ‌ల్ల న‌ల్గొండ జిల్లాలో వేలాది ఎక‌రాలు బీడు వారుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు త్వ‌రగా పూర్తి చేసేందుకు ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకువ‌స్తాన‌ని తెలిపారు. అలాగే 90శాతం పూర్త‌యిన బ్ర‌హ్మ‌ణ వెల్లంల ప్రాజెక్టుకు వంద కోట్లు ఖ‌ర్చు చేస్తే పూర్తై వేల ఎక‌రాల‌కు సాగునీరు అందుతుంద‌ని వెల్ల‌డించారు. ఇందుకోసం ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తాన‌ని తెలిపారు. వీటితో పాటు భువ‌న‌గిరి పార్ల‌మెంట్ ప‌రిధిలోని గంధ‌మ‌ల్ల‌, బ‌స్వాపురం రిజ‌ర్వాయ‌ర్లు త్వ‌ర‌గా అందుబాటులోకి వ‌చ్చేలా స‌ర్కార్‌పై ప్ర‌జ‌ల ప‌క్షాన యుద్దం చేస్తాన‌ని తెలిపారు.