మంత్రి హరీష్ రావుకు ఝలక్ : వేదిక దిగి వెళ్లిపోయిన మంత్రి

0
105

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన అసహనానికి గురై సభా వేదిక నుంచి దిగి వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోయే వరకు నిరసన ఆగలేదు. అసలేమైంది? ఎక్కడ జరిగింది? వివరాలు ఇవీ…

సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని కుకునూరుపల్లి, తిప్పారం, ముద్దాపూర్ గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి హరీష్ రావు గురువారం విజిట్ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో పాల్గొని మాట్లాడారు. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పనులు 95శాతం పూర్తయ్యాయని హరీష్ రావు పలు సభల్లో చెప్పారు. మరో నెలరోజుల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లు అందుతాయని వివరించారు.

అయితే ఇంతవరకు బాగానే ఉన్నా… తిప్పారం అనే గ్రామంలో మంత్రి హరీష్ ప్రసంగాన్ని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. మంత్రి మాట్లాడుతుండగా పెద్దఎత్తున నిరసనకు దిగారు. తమ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదని సీరియస్ అయ్యారు. ఏడేళ్లవుతున్నా… ఇంకెప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారని నిలదీశారు. ఉత్తుత్తి మాటలతో కడుపు నిండదు.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా వారిని మంత్రి సముదాయించే ప్రయత్నం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి తీరుతామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ మహిళలు శాంతించలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన మంత్రి హరీష్ రావు సభా వేదిక నుంచి దిగి అక్కడి నుంచి సీరియస్ గా వెళ్లిపోయారు.