కరోనా డెల్టా వేరియంట్ కేసులు చాలా దేశాల్లో పెరుగుతున్నాయి. వేగంగా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది అంటున్నారు నిపుణులు. కరోనా డెల్టా వేరియంట్ కేసులు ఆస్ట్రేలియాలోనే అతి పెద్ద నగరమైన సిడ్నీలో భారీగా నమోదు అవుతున్నాయి. దీంతో లాక్ డౌన్ ను కఠినతరం చేశారు. గత 24 గంటల్లో 44 డెల్టా వేరియంట్ కేసులు నమోదు కావడంతో సిడ్నీ అధికారులు అలర్ట్ అయ్యారు.
అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని చెబుతున్నారు. బయటకు ఎవరూ రాకుండా కఠిన ఆంక్షలు పెడుతున్నారు. ఇప్పటికే సిడ్నీలో లాక్ డౌన్ మూడో వారానికి చేరుకుంది. వ్యాక్సిన్ వేయించుకోని వారు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. కరోనా వ్యాక్సినేషన్ ఓ పక్క జరుగుతోంది. మరో పక్క కేసులు నమోదు అవుతున్నాయి. అయితే నమోదు అవుతున్న కేసుల్లో ఎక్కువ శాతం టీకా తీసుకోని వారు ఉన్నారు.
జూన్ మధ్య నుంచి సిడ్నీలో 439 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆస్ట్రేలియా జనాభాలో 9 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు. మరింత వేగంగా టీ కా ప్రక్రియ జరగాలి అని చెబుతున్నారు నిపుణులు.