మహిళలపై నేరాలకు సైబర్ ల్యాబ్ తో చెక్

0
143

రాష్ట్రంలో మహిళలు, పిల్లల పట్ల జరిగే సైబర్ నేరాలను నివారించేందుకు గాను రాష్ట్ర పోలీసు శాఖలో ప్రత్యేకంగా సైబర్ ల్యాబ్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సైబర్ ల్యాబ్ పై మహిళా భద్రత విభాగం అడిషనల్ డి.జి స్వాతిలక్రా, సైబర్ ఇంటలీజెన్స్, డిజిటల్ ఫోరెన్సిక్ పరిశోధన కేంద్రం (సి.ఆర్.సి.ఐ.డి.ఎఫ్) ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంపై డి.జి.పి మహేందర్ రెడ్డి సమక్షంలో సంతకాలు చేశారు.

డి.ఐ.జి బి.సుమతి, సి.ఆర్.సి.ఐ.డి.ఎఫ్ డైరెక్టర్ ప్రసాద్ పాటిబండ్ల తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో డి.జి.పి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ….రాష్ట్ర జనాభాలో 50శాతం ఉన్న మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని, దీనిలో భాగంగానే మహిళలు, పిల్లలు సైబర్ నేరాలకు గురికాకుండా ఉండేందుకు సైబర్ ల్యాబ్ ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే సమాజంలోని భిన్న వర్గాల భాగస్వామ్యంతో మహిళా భద్రత విభాగం ద్వారా పలు చర్యలను చేపట్టడం జరిగిందని అన్నారు.

మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి ఫిర్యాదులు అందినప్పుడే వారిపై జరిగే నేరాలను అరికట్టేందుకు సాధ్యమవుతుందని, ఇందుకుగాను సైబర్ నేరాల పట్ల అవగాహన, చైతన్య కార్యక్రమాలను చేపట్టడం, సైబర్ నేరాలను పరిష్కరించేందుకు ఈ సైబర్ ల్యాబ్ దోహదపడుతుందని తెలియజేశారు. సైబర్ నేరాలపై స్థానికంగానే ఫిర్యాదులు స్వీకరించడం, పరిష్కరించేందుకుగాను పోలీస్ స్టేషన్ స్థాయిల్లోనే సైబర్ వారియర్లను ప్రత్యేకంగా నియమించడం జరిగిందని వివరించారు. కోవిడ్ లాక్ డౌన్ నేపథ్యంలో మహిళలు, పిల్లలపై నమోదైన ప్రతి కేసులో సైబర్ పాత్ర ఉందని వెల్లడించారు.

నైపుణ్యం గల ఐటి ప్రొఫెషనల్స్ తో ఏర్పాటుచేసిన ఈ సైబర్ ల్యాబ్ తో సైబర్ సంబంధిత నేరాలను నియంత్రించే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. మహిళా భద్రత విభాగం అడిషనల్ డి.జి స్వాతిలక్రా మాట్లాడుతూ… 2020-21 సంవత్సరాన్ని సైబర్ సేఫ్టీ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో సైబర్ సంబంధిత నేరాల పరిష్కారం, నియంత్రణకు సైబర్ ల్యాబ్ దోహదపడుతుందని అన్నారు. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో మహిళలపై 7శాతం పిల్లలపై 5శాతం సైబర్ సంబంధిత నేరాల నమోదు పెరిగిందని తెలిపారు. వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్ట్రా గ్రాం, ట్విట్టర్ తదితర సామాజిక మాద్యమాల ద్వారానే ఈ నేరాలు నమోదవుతున్నాయని పేర్కొన్నారు.

మహిళలు, పిల్లలపై నేరాల నియంత్రణ, నేర పరిశోధన కోసం దేశంలోనే తొలిసారిగా ఈ సైబర్ ల్యాబ్ ను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ఆర్ అండ్ డి సెంటర్ లాగా పనిచేసే ఈ ల్యాబ్ లో నేరాల పరిశోధనకు సంబంధించిన అత్యాధునిక శాస్త్రీయ పరిజ్ఞానం, ఐటి సంబంధిత సాంకేతిక అంశాలను సి.ఆర్.సి.ఐ.డి.ఎఫ్ అందిస్తుందని డి.ఐ.జి సుమతి పేర్కొన్నారు. సైబర్ ఆధారిత వేదింపులు, గృహహింసా , ఎన్నారై కేసులు, మానవ అక్రమ రవాణా, పిల్లలపై జరిగే లైంగిక వేదింపులు, చైల్డ్ ఫోర్నోగ్రఫి తదితర అంశాలపై ఈ సైబర్ ల్యాబ్ పనిచేస్తుందని ఆమె తెలిపారు.