మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి కుట్ర పన్నారని తెలిపారు. హంతక ముఠాతో చేతులు కలిపినట్లు తనకు సమాచారం ఉందని పేర్కొన్నారు. నయీం చంపుతానంటేనే తాను భయపడలేదు.. మీరెంత? అని, ఇలాంటి చిల్లర ప్రయత్నాలకు తాను భయపడనని స్పష్టం చేశారు.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో సోమవారం ‘ప్రజాదీవెన యాత్ర’ పేరిట ప్రారంభించిన పాదయాత్రలో ఈటల చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి.‘ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడిని. ఈటల మల్లయ్య కొడుకుని ఆత్మగౌరవం కోసం ఏ స్థాయిలో అయినా కొట్లడతా.. దుబ్బాకలో ఏం జరిగిందో అదే హుజుర్‌నగర్‌లో జరుగుతుంది.
2018లో నన్ను ఓడించడానికి కుట్రలు చేసినా నా ప్రజలు అండగా నిలిచారు.. ఇప్పుడు నిలుస్తారు. చట్టం మీద నాకు విశ్వాసం ఉంది.. పోలీసులు సహకరించండి’ అని ఈటల రాజేందర్ తెలిపారు. ఉప ఎన్నిక సందర్భంగా ఈటల రాజేందర్ పాదయాత్ర చేపట్టారు. హుజురాబాద్ నియోజకవర్గవ్యాప్తంగా పర్యటించనున్నారు.