జేసీ బ్రదర్స్ టీడీపీని వీడి బీజేపీలో చేరే అవకాశముందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే వారు ఇప్పటికిప్పుడు టీడీపీని వీడి వేరే పార్టీలో చేరకపోయినా ప్రస్తుతానికైతే టీడీపీకి దూరం పాటించాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఎన్నికల్లో పార్టీ ఓటమిపై సమీక్ష జరిపేందుకు ఆదివారం టీడీపి అనంతపురం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి జేసీ బ్రదర్స్ హాజరు కాలేదు. మరోవైపు సమావేశానికి గైర్హాజరైన నేతలంతా.. టీడీపీకి దూరమైనట్లేనన్న అభిప్రాయం.. ఆ పార్టీ ముఖ్యనేతలలో ఏర్పడింది. సమావేశానికి మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి గానీ, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి గానీ.. ఇటీవల ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దిగిన జేసీ పవన్‌రెడ్డి గానీ, జేసీ అస్మిత్‌రెడ్డి గానీ హాజరుకాలేదు. హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి కూడా సమావేశానికి రాలేదు. ఈ నేతలు ఎందుకు డుమ్మా కౌట్టారనే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ఆరా తీసినట్లు తెలుస్తోంది. మిగతా నేతల సంగతి ఎలా ఉన్న జేసీ కుటుంబం మాత్రం.. ప్రస్తుతం వేరే ఏ పార్టీలో చేరకుండా, టీడీపీకి దూరం పాటించాలని చూస్తున్నట్లు సమాచారం. భవిష్యత్ లో అప్పటి పరిస్థితులను బట్టి వేరే పార్టీలో చేరే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.