తగ్గిపోయిందనుకున్న మహమ్మారి కరోనా వైరస్ దేశంలో మళ్లీ విజృంభిస్తోంది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. తొలివేవ్ లో భారత్ తడబడకుండా కరోనాపై విజయం సాధించింది. కానీ సెకండ్ వేవ్ లో ఇండియా అతలాకుతలమైంది. లక్షల మరణాలు సంభవించాయి. ప్రపంచ వేదిక మీద భారత్ ప్రమాదకర దేశంగా రికార్డులోకి ఎక్కింది. ఇక థర్డ్ వేవ్ ప్రమాద ఘంటికలు మోగించేందుకు తయారైంది.
ఒకవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా మరోవైపు ప్రజలు అప్రమత్తతతో మాస్కులు ధరిస్తున్నా సరే మూడో వేవ్ దూసుకొస్తోంది. రోజురోజుకూ తగ్గిపోతున్న కేసుల సంఖ్య ఇటీవల వారం రోజులుగా పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నది. శుక్రవారం దేశవ్యాప్తంగా 44,230 కేసులు నమోదయ్యాయి. ఈనెల 8వ తేదీ తర్వాత పరిశీలిస్తే ఈ సంఖ్య అధికం. నిన్న శుక్రవారం దేశమంతా కలిపి 555 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశం మొత్తం మీద కేసుల సంఖ్య 3,15,72,344 కి చేరింది. ఇప్పటి వరకు కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య 4,23,217 మంది.
మహారాష్ట్ర, కేరళలో తీవ్రత
కోవిడ్ వల్ల ఇప్పటివరకు అత్యధికంగా నష్టపోయిన రాష్రం మహారాష్ట్ర. ఈ రాష్ట్రంలో కేసులు సంఖ్య, మరణాల సంఖ్య తీవ్రంగా ఉంది. ఇప్పుడు కేరళలో కూడా కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్నటి లెక్కలు తీసుకుంటే మహారాష్ట్రలో 190 మంది మరణించగా, కేరళలో 128 మంది ప్రాణాలు కోల్పోయారు.
అయితే 15 రాష్ట్రాల్లో నిన్న ఒక్క కోవిడ్ మరణమూ సంభవించకపోవడం ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు ఇంకొన్ని రోజులు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుంపుల్లోకి వెళ్లకపోవడం, మాస్కులు వాడడం వల్ల వ్యాధి విస్తరణకు అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు.