తిరుమలలో స్వామివారి దర్శనానికి భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఛైర్మన్‌కు విఙ్ఞప్తి చేశారు గవర్నర్ నరసింహన్. ఇవాళ విజయవాడకు వచ్చిన ఆయనను టీటీడీ పాలకబోర్డు నూతన ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తిరుమల ఆలయ పవిత్రతను సుసంపన్నం చేయాలన్నారు. నిత్యం భక్తి ప్రపత్తులతో పూజలు చేసే మీ హయాంలో తిరుమల దేవస్థానం దేదీప్యమానంగా వెలుగొందుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి బదులిస్తూ దేవస్థానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని, కొండపై రద్దీ తగ్గించేందుకు భక్తులకు కొండ కిందే వసతి కల్పించేలా చర్యలు తీసుకోబోతున్నట్టుగా తెలిపారు. అలాగే తిరుమల కొండపై కాలుష్యాన్ని సైతం తగ్గించే దిశగా ఎలక్ట్రిక్ వాహనాల్ని ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి .. గవర్నర్ నరసింహన్‌కు శాలువా కప్పి తిరుమల శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించారు.