సున్నా వడ్డీ రుణాలు….వైసీపీ భలే దొరికిపోయిందిగా !

సున్నా వడ్డీ రుణాలు....వైసీపీ భలే దొరికిపోయిందిగా !

0
95

ఈరోజు ఏపీ అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బడ్జెట్ పై మాజీ ఆర్థికమంత్రి, టీడీపీ అగ్రనేత యనమల రామకృష్ణుడు విమర్శనాత్మక రీతిలో స్పందించారు. బడ్జెట్ లో పేర్కొన్న ప్రతి పథకానికి వైఎస్సార్, జగన్ తప్ప మరో పేరులేదని విమర్శించిన ఆయన కనీసం కొన్ని పథకాలైనా మహనీయులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, కందుకూరి వీరేశలింగంల పేర్లు పెడితే బాగుండేదని యనమల పేర్కొన్నారు.

దశ ఉన్నా కానీ దిశ లేని జగన్ సర్కారు ఎన్నికల హామీలను బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం దారుణమని నిలదీశారు. అప్పులు గురించి నీతులు చెప్పిన వైసీపీ ఇప్పుడు అప్పులు చేయడం లేదా అని ప్రశ్నించారు. అప్పుల కోసం వైసీపీ ప్రభుత్వం అడుక్కోవడం లేదా అని నిలదీశారు. సున్నా వడ్డీపై అసెంబ్లీలో నానా హంగామా చేసిన వైసీపీ నేతలు.. ఈ బడ్జెట్‌లో సున్నా వడ్డీ పథకానికి కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారని విరుచుకుపడ్డారు.

చివరికి సాంఘిక సంక్షేమానికి నిధులు తగ్గించారని, నీటిపారుదల శాఖకు నిధులు సైతం కోత పెట్టారని ఆరోపించారు. మొత్తమ్మీద ఏపీ బడ్జెట్ లో ప్రచారం ఎక్కువ, పస తక్కువగా కనిపిస్తోందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఈ సున్నా వడ్డీ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఏదో చేయాలని ఈరోజు చంద్రబాబు మీద విరుచుకుపడిన వైసీపీ భలే దొరికిపోయిందని అంటున్నారు.