మంత్రి హరీష్ రావుకు మైండ్ ఖరాబ్ అయింది

0
103

హుజూరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుకు మతిభ్రమించిందని.. అందుకే ఇస్టానుసారం అబద్ధాలాడుతున్నారని భాజపా నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. హుజూరాబాద్‌లో భాజపా కోర్‌ కమిటీ సభ్యుడు వివేక్‌ వెంకటస్వామి, ఇతర నేతలతో కలిసి ఈటల మీడియాతో మాట్లాడారు. హరీశ్‌రావు మాట్లాడే ప్రతి మాట వ్యంగ్యంగా, అసత్యాలతో కూడినవిగా ఉన్నాయన్నారు. ఇతరుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు.

హుజూరాబాద్‌లో అభివృద్ధి జరగలేదని చేస్తున్న అసత్య ప్రచారాలపై చర్చకు సిద్ధంగా ఉన్నారా?అని హరీశ్‌రావుకు సవాల్‌ విసిరారు. ఉన్నతమైన స్థానంలో ఉన్న హరీశ్‌రావు దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇలానే విచక్షణ కోల్పోయి మాట్లాడితే ప్రజలు అసహ్యించుకుంటారని వెల్లడించారు.ఈటలతో పనిచేసే కార్యకర్తలెవరు? ఎవరు మద్దతుగా నిలుస్తున్నారనే వివరాలు సేకరించి, వారిని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. కాంట్రాక్టర్ల బిల్లులు నిలిపివేసి, తమ వెంట ఉంటేనే రిలీజ్ చేస్తామని బెదిరిస్తున్నారు. నేను నియమించిన కాంట్రాక్టు ఉద్యోగులను, ఇతర ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వారిని తొలగిస్తున్నారు. గ్రామాల్లో ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లను, ఇతర సిబ్బంది కుటుంబసభ్యులు భాజపా తరఫున తిరిగితే ఉద్యోగాలు తీసేస్తామని బెదిరిస్తున్నారు. రేషన్ డీలర్లను సైతం బెదిరింపులకు గురిచేస్తూ విజిలెన్స్ దాడులు చేయిస్తున్నారు.

ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా తెరాసకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. డబుల్ బెడ్‌రూం ఇళ్ల గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. హుజూరాబాద్‌లో నా వెంట వస్తే.. ఎక్కడ కట్టించానో చూపిస్తాను. హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్‌లో 500 ఇళ్లు చొప్పున కట్టించాను. సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ రావు… ఈ రాష్ట్రం మాదీ, మేం సాధించామనే రీతిలో వ్యవహరిస్తున్నారు. నిధుల మీద, రాష్ట్రం మీద వారికే హక్కుందనే విధంగా మాట్లాడుతున్నారు. కేటీఆర్, హరీశ్ రావు, కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ మధ్యనున్న దుబ్బాకలో రోడ్లు వేశారా? డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టారా ? అందుకే అక్కడ తెరాసకు ప్రజలు బుద్ధి చెప్పారు. నా మీద విమర్శలు చేసినంత మాత్రాన గొప్పవారు అవ్వరు’’ అని ఈటల అన్నారు.