కర్నాటక రాజకీయం ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపించి ఎన్నో అనుమానాలకు తావిచ్చింది. బలపరీక్షలో విశ్వాసాన్ని కోల్పోయిన జేడీఎస్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం తరపున కుమారస్వామి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మరోవైపు తాము కొత్తగా ప్రభుత్వంలోకి రాబోతున్నామని బీజేపీ పక్షనేత యడ్యూరప్ప ఇప్పటికే ప్రకటించారు. అయితే రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కొనసాగుతున్న అనిశ్చితికి ఫుల్‌స్టాప్ పెట్టేలా రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నట్టు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉంటే విశ్వాస పరీక్షలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు కుమారస్వామి ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని గవర్నర్ వాజూభాయ్ వాలా కోరారు. అయితే కుమారస్వామి ఆ పదవిలో కొనసాగుతూ పలు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారని, ఆయనకు ఎలాంటి అధికారాలు లేవని బీజేపీ ఆరోపణలు చేస్తోంది. ఈమేరకు బీజేపీ అధికార ప్రతినిధి జి. మధుసూదన్ మాట్లాడుతూ కుమారస్వామి వైఖరి అనైతికంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం ఏర్పడే వరకు కర్నాటకలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే రాజీనామాలు చేసిన రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకునేవరకు రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.