దేశంలో నిత్యం వందలాది రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో చాలామంది మరణిస్తున్నారు. మరికొంతమంది అవిటివారై బతుకీడుతుస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులను ఆదుకునే వారికి రూ.5 వేలు పారితోషికంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పథకాన్ని ప్రారంభించినట్టు కేంద్రం వెల్లడించింది.
తొలి గంటలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడేవారికి నగదుతో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తామని తెలిపింది. ఈ పథకం అక్టోబరు 15 నుంచి అమల్లోకి వస్తుంది. ఇందులో భాగంగా జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాణదాతలుగా నిలిచిన 10 మందికి రూ.1 లక్ష చొప్పున అందిస్తారు. ఈ మేరకు కేంద్రం తాజా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది.